Congress Protest: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అండగా ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిశ్చయించుకున్నారు. రైతులకు న్యాయం జరిగేలా క్షేత్ర స్థాయి పోరాటాలు చేయాలని టీపీసీసీ జూమ్ మీటింగ్ సమావేశంలో నిర్ణయించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు పేర్కొన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు పేదలకు గుదిబండగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచుతూ వారే ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలు తెలియజేసి వారిని చైతన్య పరచాలని నేతలు అభిప్రాయపడ్డారు. 111 జీవోపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయడంతో పాటు, పోరాటం చేయాలని నిర్ణయించారు. దళితబంధు పథకంలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్రామస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు.