ఏపీ కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల చేరికలు పెరగడం కలవరపెడుతోంది. జులై 20 నుంచి రోజూ సగటున 594 మంది చొప్పున వైరస్ బారిన పడి ఆస్పత్రులకు వెళ్తున్నారు. డిశ్ఛార్జి అవుతున్నవారు 500 మంది దాకా ఉంటున్నారు. జులై 2 నుంచి 11వ తేదీ మధ్య సగటున 197 మంది చేరారు. వైరస్ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వస్తున్న వేళ చేరికలు పెరగడం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అసరాన్ని గుర్తుచేస్తోందని వైద్యులు సూచిస్తున్నారు.
వైరస్ వేరియంట్లలో వచ్చిన మార్పుల వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్లు వంటి కారణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం నాటికి రాష్ట్రంలో 21 వేల 180 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 5 వేల 51 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కొవిడ్ సంరక్షణ కేంద్రాలు, ఇళ్లలో ఉంటూ వైద్యం పొందుతున్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవారిలో 47.3 శాతం మంది ఆక్సిజన్ వార్డుల్లో, 15.6 శాతం మంది ఐసీయూ(ICU)లో 4.77 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారు. కొవిడ్ చికిత్స 276 ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండగా...3 వేల 983మంది ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నారు.