తెలంగాణ

telangana

ETV Bharat / city

CAG Report on Telangana : 'ఐదేళ్లలో తొలిసారి రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదు'

CAG Report on Telangana : 2019-20 సంవత్సరంలో ఐదేళ్లలో మొదటిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని కాగ్‌ అభిప్రాయపడింది. ఆ ఏడాదిలో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా అప్పుల చెల్లింపుల కోసం వినియోగించారని తెలిపింది. 2020 మార్చ్ 31తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌-కాగ్‌ నివేదిక సమర్పించింది.

CAG Report on Telangana
CAG Report on Telangana

By

Published : Mar 15, 2022, 11:33 AM IST

CAG Report : రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలపై కాగ్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, చెల్లింపులు, బడ్జెట్‌ ఖర్చుకు సంబంధించిన అంశాలను నివేదికలో ప్రస్తావించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్ధేశించిన ద్రవ్యలోటు, జీఎస్‌డీపీలో చెల్లించాల్సిన అప్పుల నిష్పత్తిని ప్రభుత్వం సాధించిందని తెలిపింది. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారానే సమకూరిందని కాగ్ వివరించింది. ఎఫ్‌ఆర్‌బీఎంచట్టానికి అనుగుణంగానే అప్పులు ఉన్నప్పటికీ బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే లక్ష్యాల పరిమితిని అధిగమించిందని వెల్లడించింది. 2019-20 లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా ముందటి అప్పుల చెల్లింపుల కోసం వినియోగించారని కాగ్‌ వివరించింది. అప్పుల చెల్లింపులతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందన్న కాగ్‌.. 2019-20లోనూ విద్య, వైద్య రంగాలపై తక్కువ ఖర్చు కొనసాగిందని పేర్కొంది.

CAG Report 2019-2020 : 2019-20లో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదని కాగ్‌ నివేదికలో ప్రస్తావించింది. గత ఏడాదితో పోలిస్తే 2019-20లో మూలధన వ్యయం తగ్గిందని.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి ఆలస్యంతో భారీస్థాయిలో మూలధనం నిధులు చిక్కుకుపోయాయని వెల్లడించింది. ఉదయ్ పథకం కింద డిస్కంలకు 4వేల63 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని నిర్ధరించింది. ఫలితంగా ఉదయ్ ద్వారా ఆశించిన డిస్కంల ఆర్థిక పునరుత్తేజ లక్ష్యం నెరవేరలేదని తెలిపింది. చెల్లించాల్సిన ప్రజారుణం గత ఏడాదితో పోలిస్తే 18.04 శాతం పెరిగిందన్న కాగ్‌.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రుణంలో దాదాపు సగభాగం అంటే 46 శాతం రానున్న ఏడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉందని కాగ్‌ వివరించింది. చెల్లింపుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కాగ్ అభిప్రాయపడింది.

CAG Report on Telangana Economy : బడ్జెట్ అంచనాలు వాస్తవికంగా లేవన్న కాగ్‌.. బడ్జెట్ అమలు, పర్యవేక్షణ మీద తగిన నియంత్రణ లేదని స్పష్టం చేసింది. కేటాయింపులు, ఖర్చులకు మధ్య తేడాకు కారణాలు వివరించలేదని తెలిపింది. పదేపదే మిగులు ఏర్పడుతున్న శాఖలను హెచ్చరించడం లేదన్న కాగ్‌.. కేటాయింపులను ఖర్చు చేసి సామర్థ్యానికి అనుగుణంగా బడ్జెట్‌లో మార్పులు చేయలేదని తప్పుపట్టింది. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి ప్రభుత్వం అధికవ్యయం చేస్తోందన్న కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌.. గత ఐదేళ్లలో చేసిన 84వేల650 కోట్ల అధికావ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్దీకరించలేదని పేర్కొంది. 2019-20 లో బడ్జెట్ కేటాయింపులు లేకుండా 2వేల84 కోట్లు ఖర్చు చేశారని.. 2016-19 మధ్య నాలుగు సామాజిక, ఆర్థిక గ్రాంట్ల విషయంలో నిధుల వినియోగం కేటాయింపులో 50 శాతం కన్నా తక్కువగా ఉందని గుర్తించింది.

తక్కువ ఖర్చు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసిందని కాగ్‌ గుర్తించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల నిర్వహణ పారదర్శకంగా లేదని గుర్తించింది. పీడీ ఖాతాల నుంచి ప్రభుత్వ పద్దులు, బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ అదేశాలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారని అభిప్రాయపడింది. భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పాటించాల్సి ఉందని కాగ్‌ అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details