తెలంగాణ

telangana

ETV Bharat / city

మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

కొవిడ్‌ వల్ల గత ఏడాది రాష్ట్రానికి ఆర్థికంగా రూ.21 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, టీకాల పంపిణీ, ఇతర కార్యక్రమాలపై గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.

ap cm jagan, ap corona news
మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్

By

Published : Apr 9, 2021, 9:23 AM IST

కొవిడ్‌ వల్ల గత ఏడాది ఆంధ్రప్రదేశ్​కి ఆర్థికంగా రూ.21 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, టీకాల పంపిణీ, ఇతర కార్యక్రమాలపై గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. అర్హులందరికీ నెల రోజుల్లోగా టీకా పంపిణీ పూర్తి కావాలన్నారు. ప్రస్తుతం పట్టణ/వార్డు సచివాలయాల్లో మాత్రమే జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని గ్రామాల్లోనూ ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి టీకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో టీకాల ధరలు పెరగకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు.

104కు ఫోన్‌ చేస్తే వైద్యం అందాలి
‘వైరస్‌ సోకినవారు ఆసుపత్రుల్లో పడక కోసం 104కి ఫోన్‌ చేస్తే గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నామో అలాగే ఇప్పుడూ వ్యవహరించాలి. జిల్లాల్లో హెచ్చుతగ్గులు లేకుండా కొవిడ్‌ ఆసుపత్రులను హేతుబద్ధంగా నిర్వహించాలి. కొవిడ్‌ సోకిన వారికి రూపాయి కూడా ఖర్చుకాకుండా ఉచితంగా చికిత్స అందించాలి. కొవిడ్‌ కిట్లను సిద్ధం చేయాలి. పీహెచ్‌సీ, 104 అంబులెన్సుల్లో పనిచేసే వైద్యుల పనితీరును పునస్సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల పనితీరుకు అనుగుణంగా వాటికి శ్రేణులు కేటాయించి, పర్యవేక్షణ పెంచాలి. వైరస్‌ బాధితులకు ఉపయోగించే రెమిడెసివిర్‌కు కొరత రాకూడదు’ అని సీఎం ఆదేశించారు.

జులై 1 నాటికి కొత్త వైద్య కళాశాలల భవన నిర్మాణాలు ప్రారంభం కావాలని జగన్‌ సూచించారు. ‘వైద్యులు, సిబ్బంది నియామకాలను పకడ్బందీగా నిర్వహించాలి. ఇప్పటివరకు 8 వైద్య కళాశాలల భవన నిర్మాణాలకు భూసేకరణ జరిగింది. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అన్ని కళాశాలల భూసేకరణ పూర్తికావాలి. వైద్య, ఆరోగ్య శాఖలు ఒకే గొడుగు కింద ఉంటే నియామకాలు సులువుగా సాగుతాయి. ఆసుపత్రుల అభివృద్ధి నిధులకు సొమ్ము విడుదలలో జాప్యం జరగకూడదు. దీనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. వైఎస్సార్‌ ఆరోగ్య క్లినిక్‌లకు మంచి రంగులు వేయాలి’ అని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ల ద్వారానే ఆసుపత్రుల నిర్వహణ జరుగుతున్నందున సమస్యలు వస్తున్నాయని, హాస్పిటల్‌ మేనేజర్లను నియమించాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల పదోన్నతులు పనితీరు ఆధారంగా జరగాలని, ప్రతి ఆసుపత్రి నిర్వహణపై ఆడిట్‌ ఉండాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details