ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని... కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాల పాటు కేంద్రమంత్రితో భేటీ అయిన జగన్... మూడు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి వివరించారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. దీనికి సంబంధించి... ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి - 2020 శాసనసభ ఆమోదం తెలిపిందన్నారు.
హైకోర్టు తరలించడానికి చర్యలు తీసుకోండి
కర్నూలుకు హైకోర్టును తరలించడానికి న్యాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. రాయలసీమలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేస్తామని భాజపా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. శాసన మండలి రద్దు అంశాన్నీ కేంద్రమంత్రితో చర్చించిన జగన్.. మండలి రద్దును శాసనసభ సిఫారసు చేసిందని, త్వరగా తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గించడానికి దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, దీన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు వేగవతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటిపై కేంద్రమంత్రికి జగన్ వినతిపత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి:
ఎన్డీఏలో చేరికపై రాష్ట్ర మంత్రుల చెరో మాట