రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై చర్చించారు. సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.
ధరణితోనే లావాదేవీలు.. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ - ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష
11:49 November 15
ధరణితోనే లావాదేవీలు.. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్
అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానంలో, సులువుగా, సత్వరమే భూలావాదేవీలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా భూ లావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానంలో ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా ఇతరత్రా లావాదేవీలన్నీ ధరణి ద్వారానే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కూడా ఏక కాలంలో చేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ధరణి ద్వారా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గత రెండు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం
ఇళ్లు, ఫ్లాట్ల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గ్రామపంచాయతీలు, ఇతర పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా... జీహెచ్ఎంసీ సహా శివారు పట్టణాల్లో కొంత మిగిలి ఉంది. మీ సేవా సెంటర్లలో ప్రజలు కూడా వారి ఆస్తుల వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయరాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి :ప్రజారోగ్యానికి 'పంచతత్వ'... హైదరాబాద్‌లో పార్కు ప్రారంభోత్సవం