పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు రంగం సిద్ధమైంది. అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులు, అధికారులతో విస్తృతంగా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు.
గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులకు మార్గదర్శకం చేసేందుకు సెప్టెంబర్ 3న హైదరాబాద్‌ని తెలంగాణ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్మెంట్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్లతో పాటు డీఎఫ్ఓలు, జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలను ఈ సమావేశానికి ఆహ్వానిస్తారు.
సెప్టెంబర్ 4న అన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసే అధికారులతో సమావేశమై కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు.
ఇదీ... 30 రోజుల కార్యాచరణ
దీనిలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహిస్తారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెబుతారు. ప్రభుత్వ ఉద్దేశాలను వివరిస్తారు. చేపట్టే పనులపై 30 రోజుల ప్రణాళికను తయారు చేస్తారు. రెండో రోజు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక, గ్రామానికున్న అవసరాలేంటి? ఉన్న వనరులేంటి? అనే విషయాలను అంచనా వేసుకుని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ఆ ఏడాది చేయాల్సిన పనులకు సబంధించి వార్షిక ప్రణాళికను, ఐదేళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించి పంచవర్ష ప్రణాళికను రూపొందిస్తారు ఈ ప్రణాళికలకు గ్రామసభ నుంచి ఆమోదం తీసుకుని... ప్రణాళిక ఆధారంగానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణ
- కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించడం.
- నీరు నిలువకుండా చర్యలు చేపట్టి దోమల ఉత్పత్తిని నిరోధించడం, పాఠశాలలు, అంగన్‌వాడీలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచడం వంటివి చేస్తారు.
- డ్రైనేజీల శుభ్రం, డ్రెయిన్ల రిపేర్లు, మురికి కాలువల్లో ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగించడం, అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లటం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలను చేపడతారు.
- గ్రామస్థులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించి సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు చర్యలు చేపడతారు.
- గ్రామ పంచాయతీలలో చెత్త సేకరణకు ట్రాక్టర్ సమకూర్చుకోవడం. గ్రామ పంచాయతీలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తారు.
హరితహారం
- గ్రామ పంచాయతీలే గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున, శాశ్వత ప్రాతిపదికన నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపిక చేసి... నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి.
- గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి.
- అటవీ శాఖ 12,751 గ్రామ పంచాయతీ హరిత హరం నర్సరీలతో పాటు కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు
- ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన పండ్లు, పూల మొక్కల ఇండెంట్‌ను గ్రామపంచాయతీ సేకరించాలి.
- గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు, రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ ప్లాన్(హరిత ప్రణాళిక)ను సిద్ధం చేయాలి. ఈ గ్రీన్ ప్లాన్‌ను గ్రామసభ ఆమోదించాలి.
- జిల్లా గ్రీన్ కమిటీ సూచనలకు అనుగుణంగా హరిత ప్రణాళిక రూపొందించాలి
- గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి
- గ్రామ పంచాయతీ బడ్జెట్లో పది శాతం నిధులను పచ్చదనం పెంచే కార్యక్రమాల కోసం కేటాయించాలి.