KCR On Debts: చట్టసభల్లో చర్చల సరళి మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. సమకాలీన, సామాజిక ధోరణులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం దేశంలో ప్రబలి ఉందని సీఎం చెప్పారు. పార్లమెంటు, రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెడితే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని అధికారపక్ష నేతలు చెబుతుంటారని.. బడ్జెట్‌లో పసలేదని విపక్ష నేతలు తమ అభిప్రాయం చెబుతారని కేసీఆర్ అన్నారు. ఏళ్ల తరబడి ఇదే విధమైన ధోరణి కొనసాగుతోందన్నారు. సమకూర్చుకున్న నిధుల వినియోగంపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న సీఎం.. ప్రపంచంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
"స్వాతంత్ర్యం వచ్చాక దేశ తొలి బడ్జెట్ రూ.190 కోట్లు మాత్రమే. దేశ తొలి బడ్జెట్‌లో రూ.91 కోట్లు రక్షణ నిధికి కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రాల బడ్జెట్ రూ.లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌ను ప్రభుత్వ, ప్రైవేటు బడ్జెట్‌గా పరిగణించవచ్చు. ప్రైవేటు బడ్జెట్ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నిల్వలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి తారుమారు అవుతుంది. రంగాలవారీగా చేయాల్సిన ఖర్చుల ఆధారంగా ప్రణాళిక తయారీ చేస్తారు. బడ్జెట్ ప్రణాళిక మేరకు నిధుల కూర్పు ఉంటుంది." - కేసీఆర్
తెలంగాణది 25వ స్థానం..
తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ఆర్‌బీఐ చెబుతోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామన్నారు. అప్పులు చేసే రాష్ట్రాల క్రమంలో 25వ స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశం విత్త విధానాన్ని నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమేనన్న ప్రభుత్వం.. ఇందులో కొద్ది మేర మాత్రమే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.
వారివి అణచివేసే చర్యలే..
కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలుగా ప్రస్తుత కేంద్ర విధానం ఉందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ధోరణి ఉందని విమర్శించారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలో ఉందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రాలను అణచివేసే చర్యలను కేంద్రం చేపడుతోందని మండిపడ్డారు.
భారత్ అప్పు రూ.152 లక్షల కోట్లు..