తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2019, 5:17 AM IST

Updated : Oct 13, 2019, 7:16 AM IST

ETV Bharat / city

సమ్మె ముమ్మాటికి చట్టవిరుద్ధమే..!

ఆర్టీసీ సమ్మెపై మరింత కఠినంగా వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మెలో పాల్గొన్న వారిని విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. మూడు రోజుల్లో బస్సులన్నీ వందకు వందశాతం నడిపిస్తామని తెలిపారు.

"సమ్మె"ముమ్మాటికి చట్టవిరుద్ధమే..!

"సమ్మె"ముమ్మాటికి చట్టవిరుద్ధమే..!

హైదరాబాద్​ ప్రగతి భవన్​లో ఆర్టీసీ సమ్మె పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లోగా అన్ని ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక సిబ్బందిని నియమించి అన్ని బస్సుల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఎవరైనా బస్సులు ఆపినా, విధ్వంసాలకు దిగినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

విపక్షాలకు దీటుగా సమధానం

ఓ వైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు కార్మికసంఘాలు, విపక్షాలకు దీటుగా సమధానం ఇచ్చే పనిలో పాలకపక్షం పడింది. ఈ మేరకు మంత్రులు, నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. కేవలం తన ప్రకటనలు, రవాణాశాఖా మంత్రి స్పందన మాత్రమే కాకుండా మంత్రులు, నేతలందరూ ప్రభుత్వ వైఖరిని వివరించాలన్నారు.

భాజపా నేతలపై కేసీఆర్ ఆగ్రహం

కార్మికులకు మద్దతు తెలుపుతున్న భాజపా నేతలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే, ఎయిర్ లైన్స్​లను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంటే స్థానిక కమలం నేతలు మాత్రం... ఆర్టీసీ విలీనం అంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, నేతలకు సూచించారు.

ఆరోపణలు తిప్పికొట్టండి..!

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​తో పాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మరికొందరు మంత్రులు ఇవాళ స్పందించేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని స్థాయిల్లో నేతలు కూడా స్పందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:సమ్మె ఉద్ధృతం చేసినా... పిల్లిమొగ్గలేసినా భయపడేది లేదు'

Last Updated : Oct 13, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details