స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అనంతరం గోల్కొండ చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో ఉదయం పదిన్నరకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం గోల్కొండ కోట వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను ప్రదర్శించనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో సాయంత్రం నిర్వహించే ఎట్హోం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా రద్దు చేశారు.