హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం
11:16 October 29
హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం
ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టు ముందు వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. న్యాయస్థానంలో మధ్యాహ్నం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టు నిన్న ప్రధానంగా ప్రస్తావించిన అంశాలపై సమీక్షలో చర్చించారు.
న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన వివరణపై ప్రధానంగా దృష్టి సారించారు. నాలుగు డిమాండ్లు నెరవేర్చేందుకు రూ.46 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా అన్న హైకోర్టు ప్రశ్నకు ఇచ్చే సమాధానంపై చర్చించారు. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన సమాధానం, వాదనలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం సమావేశం అనంతరం మంత్రి అజయ్, రాజీవ్ శర్మ, అధికారులు, అడ్వకేట్ జనరల్ కసరత్తు చేశారు.