తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో కేసీఆర్‌ జాతీయ పార్టీ... ఈ నెలాఖరు దిల్లీలో ప్రకటన!! - KCR meeting with party leaders

KCR meeting with party leaders
KCR meeting with party leaders

By

Published : Jun 11, 2022, 12:43 AM IST

Updated : Jun 11, 2022, 6:36 AM IST

00:40 June 11

KCR on national politics: 'భారత్​ రాష్ట్రీయ సమితి'

KCR on New Political Party: కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్‌ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. భారత్‌ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరును రిజిస్టర్‌ చేయించనున్నట్లు తెలిసింది. కొత్త పార్టీని ఈ నెలాఖరులో కేసీఆర్‌ దిల్లీలో ప్రకటించే వీలుంది. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతిభవన్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో చూచాయగా బీఆర్‌ఎస్‌ గురించి కేసీఆర్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు అయిదుగంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

‘‘భాజపా ఆగడాలు పెరిగిపోయాయి. ఆ పార్టీ వల్ల దేశం అథోగతి పాలైంది. కాంగ్రెస్‌ విపక్షంగానూ విఫలమైనందున దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు.ఈ పాత్రను కొత్త పార్టీ పోషిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలి. వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీయే అభ్యర్థిని ఓడించడం ద్వారా భాజపాకు తగిన గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయం. ఈ వ్యూహం అమల్లో భాగంగా జాతీయ రాజకీయాల్లో తెరాస మరింత చురుకుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ పాలన, పథకాలకు దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. కేంద్రం దీన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకే రుణాలపై ఆంక్షలు విధిస్తోంది. దీనిని దీటుగా ఎదుర్కొందాం. భావసారూప్య పార్టీలతో సమావేశమై వ్యూహం రూపొందిద్దాం. ఆంక్షల ఎత్తివేతకు కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. దీని కోసం న్యాయపోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో భాజపా ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది’’ అని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ తరుణంలో వ్యవస్థను చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఉందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులు సైతం కేసీఆర్‌ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను ముఖ్యమంత్రిగానే ఉంటూ దేశం కోసం పనిచేస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. దిల్లీ మాదిరే హైదరాబాద్‌ ఇకపై జాతీయ రాజకీయాలకు అడ్డాగా మారుతుందని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెరాసను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినా... అలా గాకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జైభారత్‌, నయాభారత్‌, భారత్‌ రాష్ట్రీయ సమితి తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం కోరినట్లు సమాచారం. మరోపక్క తమిళనాడు, బెంగాల్‌ల తరహాలో తెలంగాణలోనూ గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల కులపతి (ఛాన్సలర్‌) పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

భాజపా సమావేశాల కంటే ముందే... : హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. దీని కంటే ముందే జాతీయపార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ,మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సబితారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, గంగుల, కొప్పులఈశ్వర్‌,సత్యవతి రాధోడ్‌, నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ , లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌, సంతోష్‌కుమార్‌, రవిచంద్ర, దామోదర్‌రావు, శాసనసభ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, విప్‌లు బాల్క సుమన్‌, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, గువ్వల బాలరాజు, మాజీ సభాపతి మధుసూదనాచారి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కేటీఆర్‌పై పరువునష్టం వ్యాఖ్యలు చేయొద్దని బండి సంజయ్​కు​ కోర్టు ఆదేశం

Last Updated : Jun 11, 2022, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details