Independence day diamond jubilee in Telangana : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు హైదరాబాద్ హెచ్ఐసీసీలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాకారులు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. హెచ్ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ మొదటగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూల మాల వేసి.. వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ - తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
Independence day diamond jubilee in Telangana : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభించారు. హెచ్ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినున్నట్లు కేసీఆర్ తెలిపారు.
స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్ ఆర్ట్‌తో స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన అందర్ని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యాన్స్, లేజర్ షో అలరించాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.