CM KCR in Christmas Celebrations: ప్రపంచంలో ఎంతో విభిన్నమైన, అందమైన దేశం భారత్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్నిస్తూ.. అన్ని పండుగలను ఘనంగా జరుపుకునే పవిత్రమైన భూమి అని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. భయంకరమైన కరోనా వల్ల గతేడాది క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేకపోయామన్నారు. మళ్లీ ఇలా అందరినీ కలుసుకుని పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.
దేశంలోనే అత్యున్నత స్థానంలో తెలంగాణ..
రాష్ట్రంలో అన్ని మతాలకు సమానమైన గౌరవం, ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ మతం తోటివారిని ప్రేమించాలని బోధిస్తోందని గుర్తుచేశారు. ఎదుటివారిని ప్రేమించటమే అత్యుత్తమ మతమని వివరించారు. ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించగలగాలన్నారు. మతం ఉన్మాదస్థితికి వెళ్లినప్పుడే ప్రమాదమని హెచ్చరించారు. క్రిస్మస్ చేయాలని, బోనాలు చేయాలని, బతుకమ్మ జరపాలని తనను ఎవ్వరు అడగకపోయినా అందరికోసం జరిపిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అందరి సహకారం వల్లే నేడు తెలంగాణ.. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉందన్నారు.