CM KCR Iftar Party: కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందని.. చికిత్స చేయాల్సిన అవసరమేర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుందని స్పష్టం చేశారు. దేశం ఏ విధంగానూ నష్టపోకూడని చెప్పారు. దేశంలో కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు కానీ... దేశాన్ని నిర్మించడం చాలా కష్టమని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొప్పుల, మహమూద్ అలీ, తలసాని, ఎంపీలు కేకే, అసదుద్దీన్ ఓవైసీతో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
రాష్ట్రం వచ్చినప్పుడు నీళ్లు, విద్యుత్ లేక దుర్భర పరిస్థితిలుండేవని... నేడు అల్లా దయతోపాటు అందరి సహాకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంమంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని వెల్లడించారు. నిర్మాణాత్మక పాలన అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు.
మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మైనార్టీల పిల్లలకు పాఠశాలలు, వసతిగృహాలు నిర్మించామన్నారు. దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల విద్యాలయాలు పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అభిపప్రాయపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు చేసే వారి ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి సమస్యలు లేకుండా చేశామని చెప్పారు. అనంతరం మత పెద్దలతో కలిసి సీఎం ఇఫ్తార్ విందును ఆరగించారు.