కొవిడ్ నివారణ సహా ఆస్పత్రుల్లో నాడు- నేడు అంశాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (cm jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని , సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత కొవిడ్ నియంత్రణ, నివారణ చర్యలతో పాటు వాక్సినేషన్‌పై అధికారులతో సీఎం చర్చించారు. తూర్పు గోదావరి జిల్లాలో తప్ప.. అన్నిజిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గిందని అధికారులు సీఎంకు నివేదించారు.
తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు..
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయని అధికారులు జగన్‌కు తెలిపారు. పాజిటివిటీ రేటు (covid positivity rate in ap) 5.65 శాతం ఉందన్నారు. రికవరీ రేటు 95.93 శాతానికి చేరిందన్నారు. రాష్ట్రంలో 2,655 ఐసీయూ, 13,824 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ కవరేజీ కింద ఆస్పత్రుల్లో 91.48 శాతం బెడ్లు ఉన్నాయని.. ఇక్కడ ఆరోగ్యశ్రీ (aarogyasri) కింద రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 104 కాల్ సెంటర్ కు వస్తోన్న కాల్స్ గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం రోజుకు 1506 కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 7,056 బెడ్లు భర్తీ అయ్యాయన్నారు. బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు (black fungus active cases) 2772 ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో 922 మందికి సర్జరీలు చేసినట్లు వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
మెగా డ్రైవ్‌కు సిద్ధంగా ఉండాలి
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన వాక్సినేషన్ వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 1 కోటి 37 లక్షల 42 వేల 417 డోసుల వ్యాక్సినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. 82 లక్షల 77 వేల 225 మందికి మొదటి డోసు, 27 లక్షల 32 వేల 596 మందికి రెండు డోసుల వాక్సిన్ వేసినట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 1 కోటి 10 లక్షల 09 వేల821 మంది వ్యాక్సిన్లు అందుకున్నారని తెలిపారు. ఐదేళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లుల్లో 10 లక్షల29 వేల 266 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లనున్న 11,158 మందికి మొదటి డోసు వేశామన్నారు. జూన్ 20న నిర్వహించిన మెగా డ్రైవ్‌లో 13 లక్షల 72 వేల 481 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసిన సిబ్బందికి సీఎం జగన్ (cm jagan) అభినందనలు తెలిపారు. గత రికార్డును అధిగమిస్తూ వ్యాక్సిన్లు ఇచ్చిన వారందరికీ అభినందనలు చెప్పారు.