కరోనా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఉంటేనే సమర్ధంగా ఎదుర్కోగలమని... లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోండి
సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలు తనను కలచివేశాయని... కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏం చేయలేరన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోతే అందరికీ మంచిదని జగన్ విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే... ఏప్రిల్ 14 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. లేకుంటే కరోనా ఎప్పటికీ సమసిపోని సమస్యగా మిగిలిపోతుందన్నారు. మనమంతా జాగ్రత్తగా ఉంటే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు జగన్. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు.
'కేసీఆర్ భరోసా ఇచ్చారు'
తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు కష్టం రానీయకుండా చూసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని జగన్ తెలిపారు.
ఏపీలో 10 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపిన ఏపీ సీఎం... ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. 27,819 మంది ఇటీవల విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వీళ్లందరూ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.
విధుల్లో ఉన్న వారికి అభినందనలు
ఏపీలో ఇంటింటికీ సేవలు అందిస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లను ఏపీ సీఎం అభినందించారు. వీళ్లందరూ నిబద్ధతతో పని చేస్తున్నందునే 10 కేసులకే పరిమితమయ్యామని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిపై మరింత దీటుగా పోరాడేందుకు 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 4,500 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా రోగుల కోసం ఏపీలోని ప్రతి జిల్లాలో 200 పడకలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో చికిత్స కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 213 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు.