పొదుపు సంఘాల్లో మహిళల రుణాలు తిరిగి చెల్లించేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్‌పై బటన్ నొక్కి రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల రుణాలను విడుదల చేశారు. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న అప్పుల్ని 4 విడతల్లో చెల్లిస్తామని ఎన్నికల ముందు సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలివిడతగా 6,792 కోట్ల నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,71,302 స్వయం సహాయక బృందాల్లోని 87,74,674 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. 4 ఏళ్లలో 27,168 కోట్ల మహిళల రుణాలను చెల్లించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
మహిళల ఇష్ట ప్రకారమే...
వైఎస్ఆర్ ఆసరా కింద ఇస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలనే అంశాన్ని మహిళలకే వదిలేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇచ్చిన డబ్బుని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్వయం ఉపాధి కల్పించడంలో సహకరించేందుకు పలు మల్టీ నేషనల్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. వ్యాపారాలు చేసుకోవడం సహా స్వయం ఉపాధి కల్పించడానికి ఆయా సంస్థలు, బ్యాంకులు అన్నిరకాలుగా సహకరిస్తాయన్నారు. శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్, తక్కువ ధరకే వస్తువులను ఇప్పించడంలో సహకరిస్తాన్నారు. సాయం కావాల్సిన మహిళలు మెప్మా, సెర్ప్ అధికారులకు లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని అన్నారు.
మహిళా ఆర్ధిక సాధికారతే లక్ష్యం
మహిళలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందరికీ సంక్షేమం అందాలని, సంతోషంగా ఉండాలని మహిళల కోసం 15 నెలల కాలంలో వివిధ పథకాలను తీసుకువచ్చామన్నారు. బిడ్డ కడుపులో పడిననాటి నుంచి 6 ఏళ్ల వరకు పోషణ కోసం 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' తీసుకువచ్చామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు.
అమ్మఒడి.. విద్యాదీవెన