Chinthan Shibir: పీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన చింతన్ శిబిర్ ముగిసింది. పార్టీలో సంస్థాగతంగా మార్పులు, ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సాగిన నవ సంకల్ప మేథోమధన సదస్సు ముగిసింది. హైదరాబాద్ శివారు కీసరలో నిర్వహించిన ఈ సమావేశాల్లో పత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు చేసిన ప్రతిపాదనలను క్రోడీకరించి.. వాటిపై చర్చించారు. ఆ అంశాల అమలు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశాల్లో ప్రధానంగా.. ఉదయ్‌పూర్‌లో తీసుకున్న నిర్ణయాలను బూతుస్థాయికి తీసుకుపోడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. అందుకోసం జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి.. ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు.
"రెండు రోజులపాటు కీసర బాల వికాస కేంద్రంలో జరిగిన నవ సంకల్ప మేధోమధన సదస్సు విజయవంతమైంది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆరు ప్రధానాంశాలపై సుధీర్గ, సమగ్ర చర్చ జరిగింది. పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదు. ఈ మేధోమధన సదస్సుల్లో ప్రత్యేక 6 బృందాల్లో ఉన్న సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక సిద్దం చేస్తున్నాం. వరంగల్ సభ మాదిరిగా మహిళల కోసం ఒక భారీ బహిరంగ సభకు నిర్వహించడంతో పాటు గిరిజనులకు అండగా నిలబడాలని తీర్మానం చేశాం. కొవిడ్ బారిన పడిన సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్నికలకు అభ్యర్థులను 6 నెలల ముందే ప్రకటించటంతో పాటు.. కనీసం 3 నెలల ముందే మేనిఫెస్ట్ విడుదల చేయనున్నాం. భవిష్యత్‌లో నిత్యవసర సరుకులు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తాం. రైతులకు,రైతు కూలీలకు పెన్షన్ అందిస్తాం." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
చింతన్ శిబిర్‌లో నేతలు తీసుకున్న నిర్ణయాలు..
1. రాజకీయం..
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత..
- ఎన్నికల్లో అవకాశం రాని వారికి ప్రభుత్వం వచ్చిన తరువాత అవకాశం..
- డిసెంబర్ 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గ్రామ స్థాయిలో ఘనంగా నిర్వాహణ..
- కనీసం 3 నెలల ముందు మేనిఫెస్టో ప్రకటన..
- 6 నెలల ముందే ఎన్నికల అభ్యర్థుల ప్రకటన..
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అమ్మ హస్తం మాదిరిగా నిత్యవసర సరుకుల పంపిణీ..
- గిరిజన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ బలంగా పోరాడాలి..
- విద్యా, ఆరోగ్యం ఉచితంగా ఇచ్చేందుకు ప్రాధాన్యత..
2. సంస్థాగతంగా పార్టీ బలోపేతం..
- సెక్యులరిజం, సోషలిజంను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
- ఎన్నికల్లో యువత మీద ప్రధాన దృష్టి..
- బూత్ స్థాయి నుంచి ప్రతి 100 మందికి ఒక ఇంఛార్జి నియామకం..
- జిల్లా, రాష్ట్ర, స్థాయి కమిటీలు ఏర్పాటు..