దమ్ముంటే వాస్తవాలు బయట పెట్టాలని ప్రభుత్వానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పి... ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందఅన్నారు. ఇళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు మోడల్ హౌస్ చూపించి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. రెండు పడక గదుల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు శాసనసభలో చేసిన ప్రకటనల వీడియోలు ఈ సందర్భంగా ప్రదర్శించిన భట్టి... గోరటి వెంకన్న రచించిన'గల్లీ చిన్నదీ.. గరీబోల్ల కథ పెద్దది.. ' అనే పాటను ప్రస్తావించారు. ప్రతి డివిజన్లో 4వేల చొప్పున 96వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు... కానీ తీరా చూస్తే... 3,428 ఇళ్లు మాత్రమే నిర్మించారని వెల్లడించారు.
నిర్మాణాలు పూర్తైన లక్ష ఇళ్లు చూపిస్తామని మంత్రులు తీసుకెళ్లి... తోక ముడిచారని భట్టి ఎద్దేవా చేశారు. నగర శివారు మున్సిపాలిటీల్లోని ఇళ్లను నగర వాసులకు ఇస్తామని మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. పురపాలక ఎన్నికల్లోనూ అవే ఇళ్లను చూపించి ఎన్నికలకు వెళ్లారు. మరోసారి వాటిని చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని లెక్కలు తీసి ప్రజలు ముందుంచుతామన్నారు.