Swarna rathostavam at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం చేపట్టారు. స్వర్ణ రథంపై తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. భక్తులకు మూలమూర్తి.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిగా దర్శనమిచ్చారు.
తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం ఉత్తర ద్వార దర్శనం
శ్రీవారి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రముఖులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.
గురువారం వేకువ జామున భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్ల స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రం నుంచి మంత్రి హరీశ్ రావు దంపతులు, మంత్రి గంగుల కమలాకర్.. శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:Vaikuntha Ekadashi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు