తెలంగాణ

telangana

ETV Bharat / city

కోరికల చిట్టా తీర్చే చిత్రగుప్తుడు - చిత్రగుప్తు

చిత్రగుప్తుడివి భలే విచిత్రమైన లెక్కలు. మన జీవితాల చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. అలాంటి చిత్రగుప్తుడి పేరు వింటే అందరూ భయపడాల్సిందే! కొంతమంది ఆయనకు ఆలయాలను నిర్మించి... దైవంగా కొలుస్తున్నారు. అంతేకాదు ఈ గుడికి 200 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఆ దేవాలయం ఎక్కడో కాదు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉంది. చిత్రగుప్తుని ఆలయం గురించి ఓ లూక్కేద్దాం.

కోరికల చిట్టా తీర్చే చిత్రగుప్తుడు

By

Published : Aug 2, 2019, 2:22 AM IST

పాపపుణ్యాలను లెక్కగట్టి, స్వర్గ నరకాలకు దారిచూపే లెక్కల మాస్టారు. యమధర్మరాజు కీలక సహాయకుడు చిత్రగుప్తుడు. అంతటి విశిష్టత కలిగిన వాడు కనుకే భూలోకంలోనూ భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆలయాలు నిర్మించి, ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. విన్నపాలు కాదనలేని ఈ గుమాస్తా... ప్రజల కోర్కెలను తీరుస్తూ ఇష్టదైవంగా కొలువుదీరాడు. ఎక్కడో కాదు హైదరాబాద్​ పాతబస్తీలోనే.

కోరికల చిట్టా తీర్చే చిత్రగుప్తుడు

18వ శతాబ్దం నాటి ఆలయం

పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేస్టేషన్​ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయమిది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుణ్ని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా కొలిచేవారు. కాయస్థ వంశీయుడైన అప్పటి మంత్రి రాజా కిషన్​ ప్రసాద్​ ఈ దేవాలయాన్ని కట్టించారు. చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలనూ ఇక్కడ ప్రతిష్ఠించారు. కాయస్థ వంశీయులు రాహు, కేతు గ్రహాలకు గురువుగా భావించే చిత్రగుప్తుణ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసించేవారు. కాలక్రమంలో ఆ వంశీయులు వలసిపోవడం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైంది.

1980లో ఈ గుడి మళ్లీ వెలుగులోకి వచ్చినా పెద్దగా పూజలేమి చేసేవారు కాదు. దసరా ఉత్సవాల్లో ఆలయం ముందు సంబురాలు జరిపినా.. మళ్లీ మామూలు పరిస్థితే. చిత్రగుప్తుడి విశిష్టత తెలుసుకున్న చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి రావడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఊరు పెద్దలు చిత్రగుప్తుడికి పూజలు చేయడం ప్రారంభించారు. దాతల సాయంతో చిత్రగుప్తుడి చెంతనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు నిర్మించారు.

7వారాలపాటు పూజలు చేస్తే దోషనివారణ

చిత్రగుప్తుడి ఆలయంలో 7 వారాలపాటు క్రమం తప్పకుండా పూజ చేస్తే దోష నివారణతో పాటు పెళ్లి, చదువులు, సంతానం, ఆరోగ్యం ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కేతు దోష నివారణకు పూజ చేసే వారు ఆ మహాగుమాస్తాకు ఇష్టమైన ఉలవలు, లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు.

దీపావళి రెండో రోజే.. చిత్రగుప్తుడి జయంతి

దీపావళి రెండో రోజును చిత్రగుప్తుడి జయంతిగా జరుపుకుంటారు. ఆరోజు ఈ బ్రహ్మపుత్రుణ్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి, పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, వ్యాపారులు, గుమస్తాలు తరలివచ్చి చిత్రగుప్తుడి ముందు తమ చిట్టా విప్పుతారు.

దేశవ్యాప్తంగా చిత్రగుప్తుడికి సుమారు 10 ఆలయాలున్నాయి. ఉత్తరాదిన 8, దక్షిణాదిలో రెండున్నాయి. అందులో ఒకటే పాతబస్తీలో ఉన్న ఈ ఆలయం. భక్తుల కోర్కెలు తీర్చే కోవెలగానే కాక.. చారిత్రక ఆనవాలుగా మిగలడం విశేషం.

ఇదీ చూడండి :ఆ ద్విచక్రవాహనానికి 57 చలాన్లు

ABOUT THE AUTHOR

...view details