తెలంగాణ

telangana

ETV Bharat / city

సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి వివరణ.. ఏమన్నారంటే..? - చినజీయర్​ స్వామి

Chinajeeyar swamy about sammakka sarakka jathara
Chinajeeyar swamy about sammakka sarakka jathara

By

Published : Mar 18, 2022, 5:39 PM IST

Updated : Mar 18, 2022, 7:10 PM IST

17:23 March 18

మేం ఎప్పుడూ ఆదివాసీలను అవమానించలేదు..

సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి వివరణ.. ఏమన్నారంటే..?

గత కొన్నిరోజులుగా సోషల్ ​మీడియాలో వైరల్​ అవుతున్న తన వ్యాఖ్యలపై త్రిదండి చినజీయర్​ స్వామి వివరణ ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్​ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. సమ్మక్క- సారక్క జాతర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వివాదంపై స్పందించిన చినజీయర్​ స్వామి.. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. తాము ఆదివాసీలను ఎప్పుడూ.. ఎవరినీ.. ఏమీ అనలేదని అన్నారు. ఆదివాసీ దేవతల పేరు చేప్పుకుని జరుగుతున్న అసాంఘీర కార్యక్రమాల గురించి వివరించే సందర్భంలో 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటలని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పూర్వాపరాలు చూస్తే ఆ విషయం అవగతమవుతుందని సూచించారు.

20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదికి రావటానికి కారణం ఏంటనేది ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో.. దాని పూర్వాపరాలు చూడకుండా కేవలం కొన్ని మాటలనే ప్రచారంలోకి తీసుకువచ్చారని వివరించారు. దేశంమంతా సమతామూర్తిస్థాపన గురించి మాట్లాడుకుంటున్న వేళ.. అది సహించని కొందరు తమపై విషప్రచారం చేయాలని చేసిన చర్యగా భావిస్తామన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము... వారిని అవమాన పరిచేలా ఎప్పుడూ మాట్లాడమని స్పష్టం చేశారు.

పూర్వాపరాలు చూడకుండా..

"ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి.. అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది."- త్రిదండి చినజీయర్‌ స్వామి

ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించినట్టు చినజీయర్​ స్వామి తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమన్నారు. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. విషయం తెలుసుకోవాలని.. ఆ తర్వాత సరైన విధానంలో స్పందించాలని హితవు పలికారు. పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదన్నారు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో తాము ఉంటామని.. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నారు. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరమని వివరించారు.

టికెట్‌ పెట్టడం వెనుక కారణమిదే: చినజీయర్‌

సమతామూర్తిని దర్శించుకోవడానికి టికెట్‌ పెట్టలేదని చినజీయర్‌ స్వామి తెలిపారు. అదో ప్రాంగణమని.. దాంట్లో ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయని వాటి నిర్వాహణ కోసమేనని ప్రవేశ రుసుమని స్పష్టం చేశారు. ఎంతో కొంత రుసుం పెట్టకుంటే వచ్చే సందర్శకులను కంట్రోల్‌ చేయడం కష్టమని పేర్కొన్నారు. అందువల్లే సామాన్యుడికి అందుబాటులో రూ.150గా ఎంట్రీ టికెట్‌ పెట్టినట్లు వెల్లడించారు. పైగా అక్కడ పూజల కోసం ఎటువంటి టికెట్లు లేవని.. ప్రసాదాలూ పూర్తి ఉచితమేనని చెప్పారు. మరోవైపు రాజకీయాలకు తాము చాలా దూరమని వెల్లడించారు.

యాదాద్రి ప్రారంభోత్సవంలో..

యాదాద్రి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటంపైన స్పందించిన చినజీయర్​స్వామి.. తాము ఏ కార్యక్రమం కోసం పాకులాడమని తెలిపారు. ఎవరైనా సలహా కోసం వస్తే ఇస్తామని.. ఏదైనా కార్యక్రమం అప్పజెప్పితే వందశాతం న్యాయం చేస్తామన్నారు. ఏ ప్రభుత్వంతోనూ విభేదాలు లేవని మరోసారి చినజీయర్​స్వామి స్పష్టం చేశారు. ఎవరైనా విభేదాలున్నట్టు భావించుకుంటే.. తమకు సంబంధం లేదని చమత్కరించారు.

ఇవీ చూడండి:

Last Updated : Mar 18, 2022, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details