ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్లో కొత్తగా మరో మూడు శాఖలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా వీటిని ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఆదాయపు పన్ను కాలనీలో, కూకట్పల్లి ఆంజనేయ నగర్‌లో, రంగారెడ్డి జిల్లా తొర్రూర్లో ఈ శాఖలను ఏర్పాటు చేశారు.
'ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే మా లక్ష్యం'
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా భారతీయ స్టేట్ బ్యాంక్ పని చేస్తున్నట్టు ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా స్పష్టం చేశారు. వినియోగదారుల సౌకర్యం, భద్రత, పెట్టుబడి కోసం అందుబాటులోకి తెచ్చిన యోనో, యోనో క్యాష్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) తదితర వాటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ సిబ్బంది అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ఆదాయపు పన్ను కాలనీలో ఏర్పాటు చేసిన శాఖ.. స్థానిక నివాసులతోపాటు చుట్టుపక్కల వాణిజ్య సంస్థల అవసరాలకు కూడా ఉపయోగకరమని ఓపీ మిశ్రా అన్నారు. కూకట్పల్లి ఆంజనేయ నగర్‌లో కొత్త శాఖను ప్రారంభించిన సందర్భంగా రూ.3.50 కోట్ల మేర గృహరుణం మంజూరు లేఖలను వినియోగదారులకు అందజేశారు. హైదరాబాద్ నగర శివారులో రంగారెడ్డి జిల్లా తొర్రూర్ వద్ద మరో గ్రామీణ శాఖను ప్రారంభించిన మిశ్రా.. ఖాతాదారులకు బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్నట్లు వివరించారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా ఎస్బీఐ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతనంగా తీర్చి దిద్దిన కార్యాలయాన్ని మిశ్రా ప్రారంభించారు. ఎల్‌హెచ్‌ఓలో పనిచేస్తున్న అవుట్‌సోర్స్ ఉద్యోగులకు డ్రై రేషన్ కిట్‌లను అందజేశారు.
- ఇదీ చూడండి :దేశానికే పరువు నష్టం!