Global Warming : నిప్పుల కొలిమివైపు మానవాళి పయనం.. ఆర్థికవ్యవస్థ అతలాకుతలం - వాతావరణ మార్పులతో భవిష్యత్ సలసల
భవిష్యత్తు కాలమంతా జనాన్ని వేడిమి అల్లాడించనుందా? మానవాళి నిప్పుల కొలిమి వైపు పయనిస్తోందా? అవుననే అంటున్నాయి... ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు(climate changes). సరాసరి ఉష్ణోగ్రతలు(temperature increase) క్రమేపీ పెరుగుతుండడం ఆందోళనకరమని ఐరాస(UNO) నివేదిక హెచ్చరిస్తోంది. దీనివల్ల విద్యుత్తు వినియోగం అధికమై... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయని, సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయి, పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని నివేదిక విశ్లేషించింది.
Global Warming
By
Published : Nov 15, 2021, 7:23 AM IST
ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల(temperature increase in cities) పెరుగుదల నగరాల్లో రెండింతలు ఎక్కువగా ఉంటోంది. ఇలాగే కొనసాగితే 2100 నాటికి మరో 4 డిగ్రీలు పెరుగుతాయనిఅంచనా. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే పారిస్ ఒప్పందానికి ఇది భిన్నం. విస్తరిస్తున్న పట్టణీకరణ, కర్బన ఉద్గారాల తీవ్రత అధిక వేడిమికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా నగరాలు, పట్టణాల్లో ఎండ తీవ్రతను ఎదుర్కొనే వారి సంఖ్య 800% పెరిగి 160 కోట్లకు చేరుతుంది. మొత్తంగా ఈ పరిణామాలు ప్రజల ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ(United Nations Environment Program)) నివేదిక పేర్కొంది. మేలుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది. నగరాలను చల్లబరిచే కార్యాచరణ రూపొందించే క్రమంలో యూఎన్‌ఈపీ(United Nations Environment Program)తోపాటు రాకీ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్, అంతర్జాతీయ మేయర్ల కన్సార్షియంలు ఈ నివేదికను రూపొందించాయి.
ఏసీలతో మరింత ముప్పు
ఎండ తీవ్రతతో ఎయిర్ కండిషనర్స్ (ఏసీ(air conditioner)) మీద ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా వేడి మరింత పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 230 కోట్ల మంది దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రాథమిక స్థాయి ఏసీలు (ఎంట్రీ లెవల్ ఎయిర్ కండిషనర్స్(entry level air conditioner)) కొనుగోలు చేయగలిగే దశలోనే ఉన్నారు. ఇందులో భారతదేశం ఒకటి. ఎక్కువ విద్యుత్తు వినియోగం, అధిక కాలుష్య ఉద్గారాలు విడుదల చేసే ఈ తరహా ఏసీల వల్ల సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఫలితంగా నగరాల్లో అల్పాదాయ వర్గాలు నివసించే ప్రాంతాలు వేడెక్కుతున్నాయి.
విద్యుత్తుపై పెనుభారం
ఏసీల వినియోగం పెరగడంతో విద్యుత్తు గ్రిడ్‌కు సంబంధించిన మౌలిక వసతులు పెంచాల్సి వస్తోంది. ఫలితంగా కర్బన ఉద్గారాల విడుదల పెరుగుతోంది. కొన్ని మెట్రో నగరాల్లో 2050 నాటికి కూలింగ్ లోడు మొత్తం పీక్ డిమాండ్‌లో 50 శాతం దాటుతుందని అంచనా. అందుకు అనుగుణంగా విద్యుదుత్పత్తి పెంచడం పెద్ద సవాలుగా మారుతుంది. పెంచలేని దేశాలు చీకట్లో మగ్గే ప్రమాదం ఉంది.
ఆరోగ్యానికి దెబ్బ
వేడి ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటోంది. తక్కువ ఆదాయం గల దేశాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువ. వడగాడ్పులను ఎదుర్కోవడానికి అవసరమైన వనరులు లేని దక్షిణాసియా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నాయి. తీవ్రమయ్యే ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కరెంటు ‘మోత’
వేడి ప్రభావం సామాన్య ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. ఆదాయంలో 5 నుంచి 15 శాతం వరకు చల్లదనం (కూలింగ్) కోసం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. చాలామంది వీటిని భరించే స్థితిలో ఉండరు. ఎక్కువ మంది వాడే ప్రాథమిక స్థాయి ఏసీల వల్ల విద్యుత్తు బిల్లులు, మరమ్మతుల ఖర్చులు పెరుగుతాయి. దీనిపై అమెరికాలోని రెండు నగరాల్లో గణాంకాలు సేకరించారు. అక్కడ ఏసీల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రజలు 436 మిలియన్ డాలర్లు (సుమారు 3,241 కోట్ల రూపాయలు) అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చినట్టు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ మనుషుల ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి.
2016లో నివాస ప్రాంతాల చల్లదనం కోసం వాడే ఉపకరణాల కోసం 2,30,280 మెగావాట్ల విద్యుత్తు అవసరమైతే, 2050 నాటికి ఇది 7,06,800 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఇది అమెరికా, యూరప్/జపాన్ దేశాలు వినియోగించే మొత్తం విద్యుత్తుకు సమానం.
అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు అయిదు శాతం పని గంటలను కోల్పోతారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరగడం వల్ల 2030 నాటికి ఎనిమిది కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. మొత్తంగా ఇది ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ఆర్థిక నష్టం 2.3 ట్రిలియన్ డాలర్లు (171 లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పాదకత తగ్గడం మొదలైతే ఈ శతాబ్దం ఆఖరికి అంతర్జాతీయంగా జీడీపీ నష్టం 10.9 శాతానికి (ప్రస్తుత నష్టం 5.6 శాతం) పెరుగుతుంది. ఇవన్నీ ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తాయి. పట్టణాల్లో పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2000-2016 మధ్య కాలంలో ప్రపంచంలో 12.5 కోట్ల మంది అదనంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురై వివిధ అనారోగ్యాలబారిన పడ్డారు. మరణాలూ పెరిగాయి. ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల అమెరికాలోని వలసకూలీలు, కార్మికులు సాధారణ పౌరుల కంటే మూడు రెట్లు ఎక్కువగా మరణిస్తారని నివేదిక అంచనా వేసింది. తక్కువ పచ్చదనం ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలు వడగాడ్పుల తీవ్రత వల్ల అయిదు శాతం ఎక్కువ ప్రమాదంలో పడతారని హెచ్చరించింది.
యు.ఎస్.నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అత్యధిక వేడిమి నమోదైన సంవత్సరం 2020. గత 140 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే 2014-20 మధ్య ఏడు సంవత్సరాల్లో వేడి (హాటెస్ట్ పిరియడ్) తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంది. వడగాడ్పుల వల్ల ఏటా మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే 2030లో ప్రపంచవ్యాప్తంగా అదనంగా 92,207, 2050 నాటికి అదనంగా 2,55,486 మరణాలు సంభవించవచ్చు.
వివిధ దేశాల్లోని 13 నగరాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆ సమయంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 3.7 శాతం పెరుగుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే 2050 నాటికి భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 30 నుంచి 50 శాతం పెరుగుతుంది. ఇది గ్రిడ్ వైఫల్యాలు సహా పలు సమస్యలకు దారితీస్తుంది.