YSRCP: ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ ప్రతి వికృత పోకడను ప్రజలు గమనిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు ఘటనలు ప్రభుత్వ దుర్మార్గాన్ని చాటి చెబుతున్నాయని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ ఉద్యోగి వాసుదేవరావుపై సర్పంచ్ భర్త గున్నయ్య దాడి చేశారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించారని కవిత అనే మహిళ ఇంటికి కరెంట్ తొలగించి పాలు, నీళ్లు కూడా అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీశారు.
ఉద్యోగులు, ప్రజల పట్ల వైకాపా గూండాలు వ్యవహరించిన తీరు ఒకెత్తైతే.. దాన్ని సమర్థించిన ప్రభుత్వం తీరు మరింత విస్తుగొలుపుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. పోయేకాలం దాపురించి కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్న వైకాపా రాక్షసులు.. వీటన్నింటికీ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సిగ్గున్న ప్రభుత్వం అయితే శ్రీకాకుళంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళపై వేధింపులకు తలదించుకోవాలని ధ్వజమెత్తారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని.. బాధితులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.