Chandrababu Chittoor Tour : వరద బాధితుల్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలోని వరద బాధితుల్ని పరామర్శించిన ఆయన.. అధికారంలో ఉన్న సీఎం ఎందుకు ప్రజల్లోకి రారని నిలదీశారు. వరదల్లో చనిపోయిన వారికి ఎన్టీఆర్ ట్రస్టు తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
చిత్తూరులో చంద్రబాబు పర్యటన
By
Published : Nov 25, 2021, 8:36 AM IST
Chandrababu Chittoor Tour : ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పాపానాయుడుపేట, తిరుచానూరు వద్ద స్వర్ణముఖి నదిపై కొట్టుకు పోయిన వంతెనను పరిశీలించారు. అక్కడి నుంచి రాయలచెరువు గండిపడిన ప్రాంతంలో పర్యటించారు. రాయలచెరువు నుంచి తిరుపతి చేరుకున్న చంద్రబాబు.. మహిళా విశ్వవిద్యాలయం వద్ద నుంచి నడుచుకుంటూ వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Chandrababu visited flood effected areas : గాయత్రి నగర్, సరస్వతి నగర్, శ్రీకృష్ణ నగర్, ఎమ్మార్ పల్లి, లక్షీపురంలోని పలు ఇళ్లలో ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే.. వైకాపా ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. నష్టనివారణ, పునరావాస చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లక్ష్మీపురం కూడలిలో వరద నీటిలో గల్లంతైన వ్యక్తి కుటుంబాన్నిచంద్రబాబు పరామర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
మిత్రుడు ఇంటికి వెళ్లిన చంద్రబాబు
chandrababu visited his friend : శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు కొమ్మినేని శ్రీనివాసులునాయుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. శ్రీకృష్ణనగర్‌లో పర్యటిస్తూ ఇక్కడే ఉంటున్న మిత్రుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పలకరించారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సీఎం పూర్తిగా అవకాశవాది..
Chandrababu on Amaravati capital : 'అమరావతి రాజధాని విషయమై రెండున్నరేళ్ల తర్వాత తప్పు చేశాం, ఉపసంహరించుకుంటున్నామన్నారు. మళ్లీ కొత్త బిల్లు తెస్తానని అంటున్నారు. మడమ తిప్పి మాటమార్చిన సీఎం పూర్తిగా అవకాశవాది. అసెంబ్లీలో నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. కొండపల్లి వంటి చిన్న మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు రెండు రోజులుగా దౌర్జన్యం చేస్తున్నారు. న్యాయస్థానానికి వెళ్తే సిగ్గు ఉందా అని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ప్రజాసేవ చేయరు, చేసే వారిని చేయనివ్వరు. మీకిచ్చిన సమయం అయిపోయింది. మార్పు ప్రారంభమైంది. ధైర్యం ఉంటే ప్రజాసేవలో పోటీపడండి, కేసులు పెట్టి చరిత్రహీనులు కావద్దు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేయదు, మరొకరిని చేయనివ్వదు. మా ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందిస్తాం. మీ సమస్యలపై సీఎంకు, సీఎస్‌కు గురువారం లేఖలు రాస్తా. వారి స్పందన చూస్తా. లేకుంటా మళ్లీ తిరుపతికి వస్తా.' అని చంద్రబాబు అన్నారు.
రాయలచెరువు పర్యటనపై ఆంక్షలు
రాయలచెరువు ప్రాజెక్టును పరిశీలించాలనుకున్న చంద్రబాబుకు పోలీసులు ఆంక్షలు విధించారు. చెరువు ప్రమాదకరంగా ఉందని, అక్కడికి వెళ్లడం శ్రేయస్కరం కాదంటూ మంగళవారమే తెదేపా శ్రేణులకు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు శానంభట్లలోని జేబీఎస్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చినప్పుడు పోలీసులు మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను అక్కడికి వెళ్లి తీరుతానని చంద్రబాబు స్పష్టంచేశారు. భారీ కాన్వాయ్ కాకుండా మూడు వాహనాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆ మేరకు ఆయన మూడు వాహనాలతో వెళ్లి రాయలచెరువు కట్టను పరిశీలించారు.