CHANDRABABU NAIDU ON SAKSHI MEDIA:‘‘సాక్షి మీడియా ఏర్పాటు కోసం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా రూ.1,200 కోట్లు సమీకరించారు. అది అవినీతి కాదని ఆదాయపన్నుశాఖకు అనిపిస్తే ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదు. అవినీతికి పాల్పడే వారిని ఎవరూ పట్టుకోలేరు. కష్టపడకుండా అడ్డదారుల్లో సంపాదించడమనే ‘జగన్ మోడల్’ ప్రతి రాజకీయ నాయకుడికి న్యూ మోడల్‌గా మారిపోతుంది...’’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
అక్రమ సంపాదనతో ఎన్నికల్లో పోటీ..!
అవినీతి, దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుని ఆదాయపన్ను కట్టేస్తే చాలు అనంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ధ్వజమెత్తారు. ‘రూ.10 షేరును... రూ.2,000, రూ.3,000 విక్రయించి అడ్డదారుల్లో సంపద పెంచుకుని ఆ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితే ఉండదు.. సీబీఐ, ఈడీలు విచారణ జరుపుతున్న కేసుల్లో ఆదాయపన్నుశాఖ వాటితో సమన్వయం చేసుకునేలా, డబ్బులు ఎలా వచ్చాయో వెల్లడయ్యేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేయాలి. లేకుంటే రాజకీయాలను వ్యాపారంగా తీసుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. ఎలా సంపాదించినా సరే మాకు పన్నులు కడితే చాలు రైట్‌రాయల్‌గా వ్యవహరించొచ్చు అనేలా ఆదాయపన్నుశాఖ వ్యవహరించడం సరికాదు' అని చంద్రబాబు అన్నారు.
అప్పులు చేయడంలో జగన్ గత సీఎంలను మించిపోయారు..
అక్రమ మైనింగ్, అక్రమ మద్యం, గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో పన్ను కట్టినా ఆ శాఖకు ఆనందమేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘చైతన్యరథం’’ పేరిట తెదేపా సామాజిక మాధ్యమ ఈ-పత్రికను మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తుంటే.. దాన్ని తగ్గించి 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అందరూ 2019 వరకూ రూ.3.14 లక్షల కోట్లు అప్పు చేస్తే.. జగన్ ఒక్కరే ఈ రెండున్నరేళ్లలో అంత అప్పు చేశారని, రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు దాటిపోయాయని చెప్పారు.
అక్రమ సొమ్ముతో రైట్ రాయల్‌గా రాజకీయ నేతల్లా చలామణీ
ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇసుక, బైరటీస్, బాక్సైట్, గ్రానైట్, ముగ్గురాయి ఇలా ఏదో ఒక ఖనిజ దోపిడీ జరుగుతోందని.. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు రైట్‌రాయల్‌గా రాజకీయ నేతలుగా చలామణీ అవుతున్నారు. పాలకులే స్మగ్లర్లు అయ్యాక పోలీసుల అండతో వివిధ రకాల మాఫియాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. కుప్పంలో నిన్నమొన్నటి వరకూ సాదాసీదా రౌడీషీటర్లుగా ఉన్న వారు ఇప్పుడు స్మగ్లర్లుగా మారి నాపైనే బాంబులు వేస్తామంటున్నారు. స్మగ్లర్లకు ఈజీ మనీ వస్తే జరిగే అరాచకాలివే...’ అని పేర్కొన్నారు.