TDP strategy committee meeting :ప్రజాసమస్యలపై పోరును మరింత ఉద్ధృతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్లో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త ఏడాదిలో క్షేత్రస్థాయి పర్యటనలతో బాధిత వర్గాల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలో రోజు రోజుకూ పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయన్న చంద్రబాబు.. రైతులు, పేదలు, వ్యాపారులు.. ఇలా అన్ని అందరూ వైకాపా పాలనా వైఫల్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాసంబంధిత 9 అంశాలపై వ్యూహ కమిటీ సమావేశంలో తీర్మానించారు.
ఈ ధరలను ఎందుకు తగ్గించటం లేదు..?
chandrababu on Commodity prices: సినిమా టికెట్ల ధరలు తగ్గించిన జగన్మోహన్ రెడ్డి.. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, గ్యాస్ ధరలను ఎందుకు తగ్గించలేదని సమావేశంలో నేతలు నిలదీశారు. తెదేపా ప్రభుత్వం ఇచ్చిన సంక్రాంతి కానుక రద్దు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అయిన జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి అని దుయ్యబట్టారు. తక్షణమే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఏపీలో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని సమావేశం తీర్మానించింది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీది 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటంతో పాటు అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో వరి వేయవద్దనే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని దుయ్యబట్టారు. మిర్చి పంట దెబ్బతిని రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతే... నవంబర్లో కురిసిన వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని ఆక్షేపించారు. 75 కేజీల ధాన్యం బస్తా రూ.వెయ్యికే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతులను దోచుకుంటున్నా పట్టించుకునే వారు లేరని నేతలు మండిపడ్డారు. తక్షణమే పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.