తెలంగాణ

telangana

ETV Bharat / city

దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే: చంద్రబాబు

ఏపీలో ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా 19 నెలల పాలనలో 127 ఆలయాలపై దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలను కాపాడే బాధ్యత సీఎం జగన్​కు లేదా అని ప్రశ్నించారు. విజయనగరం పర్యటనకు వచ్చిన సీఎం జగన్​.. రామతీర్థం ఆలయానికి వచ్చే బాధ్యత లేదా అని నిలదీశారు. జగన్ పాలనలో హిందూ ఆలయాలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆలయాల్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

cbn at ramateerdham
cbn at ramateerdham

By

Published : Jan 3, 2021, 8:56 AM IST

ఏపీలో విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. పూర్తిగా ఎటు చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది. నాటకీయ పరిణామాల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. కోనేరును పరిశీలించిన ఆయన... వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, రథాలకు నిప్పుపెట్టడం, పూజారులపై దాడి చేయడం వంటి ఘటనలు ఏపీలో జరుగుతుంటే బాధనిపిస్తోందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో 19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని.. అవి ఇచ్చిన దాతలు, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని హెచ్చరించారు. దేవుడి ఆస్తుల విషయానికొస్తే మసి అయిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమండ్రిలో సూర్యనారాయణస్వామి, పాడేరులో గిరిజనులు పూజించే అమ్మవారి పాదాలు, ఇప్పుడు మంత్రాలయంలో ఆంజనేయస్వామి ఆలయ గోపురంపై విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై కోదండ రామస్వామి ఆలయంలోని శ్రీరాముడి శిరస్సును ఖండించడంతో చంద్రబాబు శనివారం ఆ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.

దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే: చంద్రబాబు

కాపాడలేని సీఎం ఎందుకు?
‘వేంకటేశ్వరుని పాదపద్మాల వద్ద పుట్టిన నేను పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేశాను. నా హయాంలో ఒక్క మసీదు, చర్చిపైనా దాడి జరగలేదు. దేశమంతా శ్రీరామనామం మార్మోగుతుంటే, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రాముడి విగ్రహం తల నరికారంటే ఏమనాలి? దీన్ని ఖండించని సీఎంను ఏమనాలి? మంచి పాలన అంటే రామరాజ్యం అని చెప్పుకుంటాం. అటువంటి పాలన ఎన్టీఆర్‌ హయాంలో వచ్చింది. నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలను బాగా చూసుకున్నాం. ఈ సీఎంది ఏ మతమైనా కావచ్చు. కాపాడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. కాపాడకపోతే సీఎంగా ఎందుకు?’ అని ప్రశ్నించారు.

నన్ను అడ్డుకుని.. ఏ2ను స్వాగతిస్తారా?
కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. తనను దారి పొడవునా అడ్డుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మరోవైపు ఏ2 వస్తే కాళ్లపై పడతారా అని నిలదీశారు. ‘అసలు ఏ2 ఎవరు? ఎందుకొచ్చారు? నిన్న, మొన్న ఎందుకు రాలేదు? నేనొస్తానంటే పరిగెత్తుకొస్తారా? నన్ను రానీయకుండా చేయాలనుకున్నారు. ఇలాంటి చోటామోటా నాయకులను చాలామందిని చూశా. మళ్లీ హెచ్చరిస్తున్నా.. పులివెందుల రాజకీయాలు ఇక్కడ చేయొద్దు. దేవాలయాల వద్దకు వెళ్లి క్రైస్తవ ప్రచారం చేస్తున్నారు. 29న ఘటన జరగ్గా 30న ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన సీఎం ఇక్కడికి రాకపోగా కనీసం దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటు. ఇంత పెద్ద ఘటన జరిగితే పోలీసులు జిల్లా అధికారులకు చెప్పలేదు. ఆర్డీవో, కలెక్టరు రాలేదు. మాజీ ముఖ్యమంత్రి అయిన నేను వస్తే ఎస్సై అయినా రాలేదు. ఏ2 వస్తే డీఎస్పీలు వస్తున్నారు. నేను వెళ్తే సాక్ష్యాలు తారుమారైపోతాయట. విజయసాయిరెడ్డికి మాత్రం దగ్గరుండి పూజలు చేశారు.

దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే: చంద్రబాబు

ఏపీలో దేవాదాయ, హోం శాఖ మంత్రులు ఇన్ని ఘటనలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కదిద్దలేకపోతే రాజీనామా చేయాలి. అవినీతి మచ్చ లేని అశోక్‌గజపతిరాజును వారసత్వంగా వస్తున్న ట్రస్టీ నుంచి ఉన్నపళంగా తప్పించడాన్ని ఏమనాలి? మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం భూములకు సంబంధించి రూ.10 లక్షల కోట్ల ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే: చంద్రబాబు

సీఎం జగన్​ స్పందించరేం: అచ్చెన్నాయుడు


తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ స్థాయిలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసమవుతుంటే సీఎం ఒక్కమాటైనా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాలపై పనిగట్టుకొని దాడులు చేయిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతుంటే చంద్రబాబు వస్తున్నారని అడ్డుపడ్డారని విమర్శించారు.

మాజీ మంత్రి కళా వెంకటరావు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి అండ్‌ కో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, అవినీతి అక్రమాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ పాకిస్థాన్‌లోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తే కేంద్రం కళ్లెర్రజేయడంతో అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకొని ఆలయాలను అభివృద్ధి చేసిందన్నారు. అటువంటిది ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేవాలయాల భూములను జేసీలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఇక్కడ ఇంత దారుణం జరిగితే అధికార పార్టీ నుంచి ఒక్క నాయకుడైనా రాకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును దారిపొడవునా అడ్డగించారని మండిపడ్డారు. ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్​.. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిందిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తప్పులు వారే చేసే తెదేపా మీద తోస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెప్పు పొందాలని కొందరు ఇతర మతాలను కించపరచడం సరికాదన్నారు.

ఇవీచూడండి:రామతీర్థం రగడ: అడ్డంకుల నడుమ కొండపైకి చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details