రెండో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పు పెండింగ్‌లో ఉన్నందున ఒకటో కృష్ణా ట్రైబ్యునల్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటినే ఉభయ తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా తెలిపారు. రాజ్యసభలో ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గోదావరి జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎలాంటి ఏర్పాట్లు లేవని పేర్కొన్నారు.
తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాకే...
గతేడాది కేంద్ర జలశక్తి మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కటారియా చెప్పారు. కృష్ణా జల వివాద పరిష్కారం కోసం అంతర్రాష్ట్ర నదీజల వివాద చట్టం-1956లోని సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరిందని, ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రస్తుత ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని సూచించిట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక కొత్త ట్రైబ్యునల్ వేయాలా లేక ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే కొత్త విధి విధానాలు నిర్దేశించాలా అన్న అంశంపై నిర్ణయానికి వస్తామని కేంద్రమంత్రి కటారియా వివరించారు.