కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాదయాత్రను నేటి నుంచి చేయనున్నారు. దానిలో భాగంగా తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు స్వాగతం పలికారు. కరోనా తగ్గుముఖం పట్టాలని తిరుమల స్వామివారిని ప్రార్థించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని సాయంత్రం 4 గంటలకు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని... నల్ల బండగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి జన ఆశీర్వాద యాత్ర చేపడతారు.
రెండేళ్లుగా కరోనా వైరస్.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. పూర్తి స్థాయిలో కరోనాను అరకట్టాల్సిందిగా.. భగవంతుడిని ప్రార్థించా. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలని సైతం వేంకటేశ్వర స్వామిని కోరుకున్నా. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున తప్పకుండా సహకారం అందిస్తాం.