తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రానికి మరో కలికితురాయి... కొత్త రింగు రోడ్డుకు మార్గం సుగమం - రీజినల్‌ రింగు రోడ్డు

రాష్ట్రానికి  రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మరో కలికితురాయిగా మారనుంది. నాలుగేళ్లుగా కాగితాల్లోనే మగ్గిన దీని నిర్మాణ ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం అవుతోంది. రెండు భాగాలుగా సుమారు 344 కి.మీ. మేర చేపట్టాల్సిన ఈ ప్రాంతీయ బాహ్యవలయ రహదారి రెండో భాగానికి కేంద్రం నేషనల్‌ హైవే హోదాను కేటాయించాల్సి ఉంది. తెరాస, భాజపాలు ఈ సువిశాల రహదారి నిర్మాణానికి ఆమోదం కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి.

central government green signal to new ring road in state
central government green signal to new ring road in state

By

Published : Feb 24, 2021, 7:39 AM IST

ప్రాంతీయ రింగు రోడ్లకు ఇప్పటి వరకు కేంద్రం జాతీయ రహదారుల హోదాను కల్పించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ వినతి నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు భాగాలుగా విభజించి ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని 2015లో కేంద్రం సూచించింది. ఆ మేరకు 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి జాతీయ రహదారి 161ఏఏ నంబరును 2016లో కేంద్రం కేటాయించింది. ఈ మార్గం విషయంలో 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నూతన ప్రతిపాదనలు చేయటంతో రింగు రోడ్డు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

కొత్త ప్రతిపాదనలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాయటంతో ప్రాజెక్టుపరంగా మళ్లీ కదలిక వచ్చింది. ప్రతిపాదనల సమయంలో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ అంచనా వ్యయం రూ.12వేల కోట్లు కాగా ఇప్పుడది మరింత పెరిగి, సుమారు రూ.17వేల కోట్లకు చేరింది. 2016 చివరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు భాగాలుగా మంజూరు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. 158 కి.మీ. భాగానికి జాతీయ రహదారి నంబరును కేటాయించినా.. రెండో భాగం విషయంలో చిక్కుముడులు ఏర్పడ్డాయి. నిర్మాణం వ్యయంలో సుమారు రూ.3,000 కోట్ల మేర భూసేకరణకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో భూములతో పాటు నిర్మాణ ఉత్పత్తుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. ప్రస్తుత అంచనాల మేరకు నిర్మాణ వ్యయం మరో రూ.5వేల కోట్ల వరకు పెరిగింది. భూసేకరణ చేసి నిర్మాణ పనులు చేపట్టేసరికి అది రూ.20వేల కోట్ల వరకు చేరవచ్చని భావిస్తున్నారు.

రవాణా అవసరాల మెరుగుదల కోసం ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం అనివార్యం. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు హైదరాబాద్‌లోని సుమారు 50 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. ముంబయి-విజయవాడ, నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారుల్లోని మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌, అసెంబ్లీ నుంచి కొంపల్లి వయా తాడ్‌బండ్‌, అసెంబ్లీ నుంచి ఆరాంఘర్‌ వరకు గ్రేటర్‌ పరిధిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో దేశంలోని ఉత్తరాది నుంచి దక్షిణాదికి పోయే జాతీయ రహదారులకు అనుసంధాన మార్గం లేకుండా పోయింది. ఈ రెండు మార్గాల్లో అనుసంధానత కోసం అవుటర్‌ రింగు రోడ్డును వినియోగిస్తున్నారు. దానిపై హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పెరిగితే జాతీయ రహదారుల కోసం సరకు రవాణా వాహనాలను అనుమతించటం కష్టమవుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. నాలుగైదేళ్లలో ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ రెండింతలవుతుందని అంచనా. అప్పటికల్లా ఆర్‌ఆర్‌ఆర్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం చేయాల్సింది...

* ప్రాంతీయ రింగు రోడ్డు మంజూరుపై అధికారిక పత్రం జారీచేయాలి.
* భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక అనుమతి ఇవ్వాలి.
* పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులివ్వాలి.
* సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు జాతీయ రహదారిగా నంబరు ఇచ్చినట్లే చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రెండో భాగానికీ ఇవ్వాలి.
* రాష్ట్రప్రభుత్వం సూచించిన ఈపీసీ, హెచ్‌ఏఎం విధానాల్లో ఏదొక మార్గంలో ప్రాజెక్టును చేపట్టాల్ఠి.

రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది...

* అధికారిక అనుమతి ఉత్తర్వులు అందాక భూసేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలి. రెండు భాగాలకు అవసరమైన భూసేకరణకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులను నియమించి, టెండర్లు పిలవాలి.
* ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలోగా భూసేకరణ పూర్తిచేసేలా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలి.

ఇదీ చూడండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

ABOUT THE AUTHOR

...view details