సామాన్యుడు ఆకాశయానం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉడాన్(ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రోత్సహిస్తోంది. టికెట్ ధరలు ఒక్కోసారి పైపైకి చేరుతుండటంతో ఆ ఆశయానికి గండి పడుతోంది. కరోనా సమయంతో పోల్చితే దేశీయ విమాన టికెట్ ధరలు పలు మార్గాల్లో కొన్నిసార్లు వంద శాతానికి మించి పెరిగాయి. ప్రస్తుతానికి అప్పటి ధరలకు కొంచెం అటూఇటూగా ఉన్నా సెలవు రోజుల్లో పెరుగుదల అధికంగా ఉంటోంది. కొవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లుగా ప్రయాణాలకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
విమానయాన సంస్థలు పలు సర్వీసులను తగ్గించుకున్నాయి. నష్టాల కారణంగా ఒకట్రెండు విమానయాన సంస్థలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో విమాన టికెట్‌ల ధరలను తగిన మేరకు నియంత్రిస్తామని తెలిపింది. ‘విమాన టికెట్ ధరలపై కేంద్ర నియంత్రణ(క్యాప్)అవసరం. అప్పుడు ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ రంగంపై ఆధారపడిన పలు విభాగాల వ్యాపారమూ వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కానీ డిమాండుకు తగిన విమాన సర్వీసులు అందుబాటులో లేవు. ఆ కారణంగా టికెట్ ధరలను పెంచేస్తున్నారు’ అని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఛైర్మన్ నగేష్ పంపాటి అన్నారు.