AP High Court News today : న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారానికి సంబంధించిన కేసు దర్యాప్తు వివరాల్ని సీబీఐ డైరెక్టర్ సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదించారు. ఆ నివేదిక ప్రతిని పిటిషనర్ / హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను డిసెంబర్ 13 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
Comments on Judges in Social Media : న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై అప్పటి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా నిందితులను పట్టుకోవడానికి , సామాజిక మాధ్యమాల నుంచి పోస్టులు తొలగించడానికి దర్యాప్తు ప్రారంభమైన మొదటి నుంచి ఏం చేశారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరకర వీడియోలను తొలగించే నిమిత్తం యూఆర్ఎల్ వివరాలను సామాజిక మాధ్యమ సంస్థలకు తెలియజేస్తున్నామని రిజిస్ట్రార్ జనరల్ పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఆ వివరాలను సీబీఐకి అందజేస్తున్నామన్నారు. ఆయా సంస్థలు తొలగిస్తున్నాయన్నారు. సీబీఐ డైరెక్టర్ సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇచ్చినట్లు తెలిసిందన్నారు.