వైఎస్ వివేకా హత్యకేసులో 69వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు.ఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి ప్రకాశ్‌రెడ్డిని, పులివెందులకు చెందిన బాబురెడ్డి దంపతులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడపలో సునీల్ బంధువు భరత్ యాదవ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని దర్యాప్తు అధికారులు విచారణకు పిలిపించారు.
పోలీసులకు సునీత ఫిర్యాదు..
తమ ఇంటి వద్ద ఓ అనుమానితుడు రెక్కీ నిర్వహించాడంటూ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తమ ఇంటి వద్ద అనుమానితుడు రెక్కీ చేశాడని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెండుసార్లు బైకుపై ఇంటి వైపు వచ్చివెళ్లాడని తెలిపారు. అనుమానితుడు వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా సునీత, ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. దీనిపై గురువారం.. పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డికి సునీత ఫిర్యాదు చేయగా..ఆయన.. వివేకా ఇంటికి వచ్చి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ వ్యక్తిని మణికంఠారెడ్డిగా గుర్తించారు. దర్యాప్తులో అతను వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి అనుచరుడిగా తేలింది. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మణికంఠారెడ్డి పులివెందులలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు సునీత లేఖలో పేర్కొన్నారు. మణికంఠారెడ్డిని విచారించిన తర్వాత రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు తొలగించారు. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ..సునీత శుక్రవారం కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో లేఖను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు.