కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అంతకుముందు ఎక్కడికి వెళ్లాడు? ఎవరెవరిని కలిశాడు...ఎప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు...తదితర సమాచార సేకరణ సవాలుగా మారుతోంది. వివిధ కారణాలతో రోగులూ పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించడం లేదు. దీంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
మూడో దశ ముంగిట..
హైదరాబాద్ నగరంలో కరోనా మూడో దశ ముంగిట ఉన్న నేపథ్యంలో మున్ముందు ప్రజలు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. నిత్యావసరాలకు ఒక్కరే రావాలని..ముక్కు, నోటికి మాస్క్ లేదా చేతి రుమాలు కట్టుకోవాలన్నారు. ఇంటికి వెళ్లే ముందు చేతులు బాగా సబ్బుతో శుభ్రపరచుకోవాలన్నారు.
ఆ సమాచారంపై మల్లగుల్లాలు..
చైనాతో పాటు, ఇతర దేశాల్లో వైరస్ ప్రబలిన సందర్భంలో వేలాదిమంది నగరానికి చేరుకున్నారు. అప్పటికప్పుడు థర్మోస్క్రీనింగ్ చేసినా చాలామందిలో సమస్య బయటపడకపోవడంతో ఇళ్లకు పంపించి వేశారు. ఆ తర్వాత 10-15 రోజులకు కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఐసోలేషన్ వార్డులో చేరుతున్నారు. ప్రస్తుతం 15 వేల మంది వరకు ఇంట్లో స్వీయ నిర్బంధం(హోం క్వారంటైన్)లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.