తెలంగాణ

telangana

ETV Bharat / city

Dharani portal issues : ఉపసంఘం భేటీతో అయినా.. ఉపశమనం దొరికేనా? - cabinet sub committee meeting on dharani portal issues

తమ భూములపై హక్కుల దక్కక తిప్పలు పడుతున్న రైతులు.. ధరణి సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి పాసుపుస్తకాలం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తమకు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఊరట కలిగిస్తాయని ఆశిస్తున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు, మీసేవా, ధరణిలో దరఖాస్తు చేస్తే ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదని అంటున్నారు.

Dharani portal issues
Dharani portal issues

By

Published : Nov 16, 2021, 6:52 AM IST

ఆన్‌లైన్‌లో తమ భూమి వివరాలు కనిపించక ఆందోళన చెందుతున్న రైతులు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం పైనే ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు. మీసేవ, ధరణిలో దరఖాస్తు చేస్తే ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదని అనేక గ్రామాల అన్నదాతలు చెబుతున్నారు. ఒక్కో గ్రామానికి పదికి పైగా సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుపుస్తకం అందని వారు కొందరైతే.. పుస్తకం వచ్చినా పూర్తి విస్తీర్ణం నమోదు కాకపోవడం, తప్పులు దొర్లడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలియజేసేలా ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిని ఏర్పాటు చేయాలంటున్నారు. ఉప సంఘం ఈ సమస్యపై దృష్టి సారించాలని బాధితులు విన్నవిస్తున్నారు.

ఉప సంఘానికి అందిన సమస్యలివి

  • మూల సర్వే నంబరును మించి విస్తీర్ణం నమోదు కావడంతో కొందరు పట్టాదారులకు పాసుపుస్తకాలు జారీకాలేదు.
  • కొందరికి కొంత విస్తీర్ణం మాత్రమే నమోదు చేసి పుస్తకాలు జారీ చేశారు.
  • జిల్లాల్లో కొన్ని ఖాతాలు, సర్వే నంబర్లు పూర్తిగా ధరణిలో నమోదు కాలేదు.
  • ప్రభుత్వం సేకరించిన విస్తీర్ణం కన్నా ఎక్కువ భూమిని దస్త్రాల్లో నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారు.
  • భూయజమాని మరణించిన సందర్భంలో వారసత్వ బదిలీకి కుటుంబ ధ్రువీకరణ పత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇబ్బందులు.
  • ఎసైన్డ్‌ భూములన్న రైతులకు డిజిటల్‌ సంతకం పూర్తికాకపోవడంతో ధరణిలోకి ఎక్కలేదు.
  • రైతు బంధు సర్వే సమయంలో సాగులో లేని పట్టా భూములను నమోదు చేయలేదు.
  • ఇద్దరు కలసి కొనుగోలు చేసిన భూమిని విక్రయించుకోవడానికి వీల్లేకుండా ఉంది.
  • పదేళ్ల కాలానికి మించి సాగులో ఉన్న ఇనాం భూములకు అధీన ధ్రువపత్రం జారీచేసి (ఓఆర్సీ) హక్కులు కల్పించాల్సి ఉన్నా ఆన్‌లైన్‌లో వారి వివరాలు కనిపించడం లేదు.
  • ధరణిలో సర్వే నంబర్ల వారీగా ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌ రావడం లేదు.
  • ధరణికి ముందు గజాల కొలతలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు ఇప్పుడు మ్యుటేషన్‌ కావడం లేదు.
  • పిల్లల పేరుతో భూమిని గిఫ్ట్‌ డీడ్‌ చేస్తే మైనర్ల ఫొటోలు పాసుపుస్తకాల్లో రావడం లేదు.

కసరత్తు ముమ్మరం

రాష్ట్రంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒక దఫా సమావేశమై సమస్యలను స్వీకరించింది.ఈనెల 20 తర్వాత మరోమారు భేటీకానుంది. ఈ లోగా సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారానికి ధరణిలో ఏర్పాటు చేయాల్సిన ఐచ్ఛికాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.

ఇక ఓపిక లేదు :

‘‘నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా.. ఇక ఓపిక లేదు. నా పట్టా భూమికి హక్కులు కల్పించండి. చేతిలో భూమున్నా అప్పు పుట్టడం లేదు. రైతుబంధు, బీమా రావడం లేదు. సమస్యను రాతపూర్వకంగా, ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అంటూ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బి.రామయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల నాటినుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమి 2.20 ఎకరాలకు 2018 నుంచి హక్కులు పోయాయి. కొత్త పాసుపుస్తకం ఇవ్వడం లేదని వాపోతున్నారు.

వాస్తవానికి రాజుపేట గ్రామంలోని సర్వే నంబరు 299లో 15 ఎకరాల భూమి ఉండగా 12 మంది రైతులు ఉన్నారు. 2017 దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులకు వారికున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణం నమోదు చేశారు. దీంతో సర్వే నంబరులో ఎక్కువ విస్తీర్ణం (ఆర్‌ఎస్‌ఆర్‌) చూపడంతో రామయ్య విస్తీర్ణం, ఖాతా తొలగించేశారు. సంగారెడ్డి జిల్లాలో మడెప్ప పాసుపుస్తకం.. భద్రాద్రిలో ఆన్‌లైన్‌లో కనిపించని లాలయ్య ఖాతా... యాదాద్రి జిల్లాలో నిషేధిత జాబితాలో విజయలక్ష్మి భూమి నమోదు.., ఇలా ఎంతలేదన్నా ఒక్కో గ్రామానికి పదికిపైగానే సమస్యలు కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details