తెలంగాణ

telangana

ETV Bharat / city

Bullet Bike Blast: ఒక్కసారిగా బుల్లెట్​లో మంటలు.. భారీ శబ్దంతో పేలుడు - బుల్లెట్ బండిలో చెలరేగిన మంటలు

Bullet Bike Blast: ఉగాది పండుగను పురస్కరించుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఓ భక్తుడు బుల్లెట్ బండిపై వచ్చాడు. అయితే ఉన్నట్టుండి అతని బండిలో మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయిన బుల్లెట్ బండి ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Bullet Bike Blast
బుల్లెట్ బండిలో చెలరేగిన మంటలు..

By

Published : Apr 3, 2022, 2:33 PM IST

Bullet Bike Blast: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఓ బుల్లెట్ బైక్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.. పూర్తిగా కాలిపోయిన బుల్లెట్ బండి పెద్ద శబ్దంతో పేలిపోయింది.

మైసూరు పట్టణానికి చెందిన రవిచంద్ర అనే భక్తుడు నూతన తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి బుల్లెట్ బండిపైనే కసాపురం వచ్చినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా బుల్లెట్ బైక్​లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలింది. అయితే పోలీసులు, స్థానికులు అప్రమత్తంగా ఉండి నీళ్లు చల్లి మంటలు ఆర్పి వేయడంతో పక్క బైకులకు మంటలు వ్యాపించకుండా ఆగిపోయాయి.

ఉగాది పండుగను పురస్కరించుకొని స్వామివారి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇలా పెద్ద శబ్దంతో బుల్లెట్ బండి పేలిపోవడం, మంటలు ఎగసిపడటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఐతే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

బుల్లెట్ బండిలో చెలరేగిన మంటలు..

ఇదీ చదవండి:పుడింగ్​ అండ్​ మింక్​ పబ్​లో పట్టుబడిన వారిలో సినీ ప్రముఖులు.. జాబితాలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్

ABOUT THE AUTHOR

...view details