EYVA By BLUESEMI : అరచేతిలో ఇమిడిపోయే చిన్న పరికరంతో ఆరు రకాల వైద్య పరీక్షలు చేసుకునే సాంకేతికతను బ్లూసెమీ అంకుర సంస్థ ఆవిష్కరించింది. దీని ద్వారా సూది గుచ్చకుండా, రక్తనమూనా అవసరం లేకుండా చక్కెర నిల్వలను తెలుసుకునే వీలు కలుగుతుంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(సీఐఈ)లో బ్లూసెమీ సంస్థ ఉంది. దీన్ని ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి మద్దికట్ల సునీల్ నాలుగున్నరేళ్ల కిందట ప్రారంభించారు. ఈ సంస్థ ‘ఐవా’ పేరిట రూపొందించిన పరికరం సాయంతో బ్లడ్ గ్లూకోజ్, ఈసీజీ, గుండె వేగం, బీపీ, ఎస్‌పీవో2, ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు.
60 సెకన్లలో ఫలితాలు..
BLUESEMI GLUCOMETER : వినియోగదారు తొలుత తన స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను వేసుకోవాలి. బ్లూటూత్ సాయంతో పరికరాన్ని అనుసంధానం చేయాలి. అనంతరం పరికరాన్ని అరచేతితో పట్టుకుని 60 సెకన్లు ఉంటే వైద్య పరీక్షల ఫలితాలు యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. వైద్యపరీక్షల ఫలితాలు అసాధారణ స్థాయిలో ఉంటే యాప్‌లో ప్రత్యేకంగా ఉండే ‘యాంథియా వర్చువల్ ప్రపంచం’లోని వాతావరణం నల్లగా మారిపోతుంది. సాధారణ స్థాయిలో ఉంటే పక్షుల కిలకిలారావాలు, జలపాతాలు, పువ్వులు వంటి ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది.
వచ్చే మార్చిలో మార్కెట్‌లోకి..
BLUESEMI GLUCOMETER EYVA : గ్లూకోజ్ స్థాయులు, ఉష్ణోగ్రతల గణాంకాలు చెప్పడమే కాకుండా.. అసాధారణ స్థాయిలో ఉంటే తీసుకోవాల్సిన చిన్నపాటి చిట్కాలనూ ‘ఐవా’ సూచిస్తుంది. పరీక్ష చేసుకున్న సమయాన్ని బట్టి సూచనలు చెబుతుంది. ఉదాహరణకు మధ్యాహ్న భోజనం తర్వాత పరీక్ష చేసుకున్నప్పుడు రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తిస్తే.. 20 నిమిషాలు నడవాలని సలహా ఇస్తుంది. ‘‘ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్ వేదికగా జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సెస్)లో భారత్ తరఫున పరికరాన్ని ఆవిష్కరించాం. పేటెంట్ కూడా వచ్చింది. వచ్చే మార్చిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రజలకు జూన్‌కల్లా అందుబాటులో ఉంటుంది. ధర రూ.15,490గా నిర్ణయించాం’’ అని బ్లూసెమీ సంస్థ వ్యవస్థాపకుడు మద్దికట్ల సునీల్ వివరించారు.