అవినీతితో రూ.వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప, ఏడేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం సాధించిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలవకుండా, ఆత్మస్థైర్యం కల్పించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి నెలకొందని.. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. ‘తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతుంది. దీనిపై సంగ్రామానికే మా యాత్ర’ అని తెలిపారు. నిజాం నిరంకుశుడని తెలంగాణ ఉద్యమ సమయంలో విమర్శించిన కేసీఆర్... ముఖ్యమంత్రి అయ్యాక నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో రూ.వేల కోట్లు ఖర్చుపెట్టే కేసీఆర్ ప్రయత్నం చూశాక.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
- ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పాదయాత్ర మొదలుపెడుతున్నారు?
ఈ యాత్ర ఓట్ల కోసం కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు. మేం 2023లో అధికారంలోకి రావడం తథ్యం. ప్రజలేం కోరుకుంటున్నారో స్వయంగా తెలుసుకుని దానికి అనుగుణంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను తయారు చేస్తాం. 35 రోజుల తొలివిడత యాత్ర అక్టోబరు 2న ముగుస్తుంది. ఆ తరువాత విడతలవారీగా 2023 వరకు పాదయాత్ర చేస్తా. మిగిలిన ప్రాంతాల్లో స్తబ్దత రాకుండా, మధ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలవారీగా సమావేశాలతో పార్టీని విస్తరిస్తాం.
- హుజూరాబాద్‌లో ఈటల పలుకుబడి, సానుభూతి కాకుండా భాజపాకు ఇంకేవైనా అంశాలు దోహదం చేస్తాయనుకుంటున్నారా?
ఒక ఎన్నికతో ప్రభుత్వం పడిపోదంటూ తెరాస పరోక్షంగా ఓటమిని ఒప్పుకుంది. దళితబంధు పథకాన్ని హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికలప్పుడు ఎందుకు అమలు చేయలేదు? ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ చేయట్లేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే ఆ పథకాన్ని తెచ్చారు. మేం దళితబంధును వ్యతిరేకించట్లేదు కానీ.. సీఎంపై నమ్మకం లేదు. అడ్డదారిలో, రూ. వేలకోట్లతో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోంది. ఈటల ఉద్యమకారుడు. అభివృద్ధి చేశారు. ఒక్కో ఓటుకు రూ. 10, 20 వేలు ఇచ్చేందుకు తెరాస సిద్ధమవుతోంది. తమ పార్టీ నాయకుల్ని తామే కొంటున్న దుస్థితిలో తెరాస ఉంది.
- భాజపా ఎంపీలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని తెరాస ప్రశ్నిస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకు నీతి ఆయోగ్ రూ.24,500 కోట్లు ఇవ్వాలని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని, విభజన హామీల్ని అమలు చేయడం లేదన్న విమర్శలపై ఏమంటారు?
మోసపూరిత హామీలతో తెరాస అధికారంలోకి వచ్చింది. వేలానికి దొరికే భూములు దళితులకు మూడెకరాలివ్వడానికి ఉండవా? దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్‌కు ఆ పదవికి అర్హుడు దొరకలేదా? 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదు కానీ... 100 గదులతో ప్రగతిభవన్ కట్టుకున్నరు. నిరుద్యోగభృతి ఇవ్వట్లేదు. పంటల రుణమాఫీ ఏది? ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఒక్కో వ్యక్తిపై రూ.లక్ష రుణభారం మోపారు. భాజపా ఎలాంటి హామీలివ్వకపోయినా తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి నిధులిస్తోంది. ఉచిత వ్యాక్సిన్, ఉచిత బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిధులు కేంద్రానివే. కేంద్రం ఇచ్చే ‘కంపా’ నిధులతో హరితహారం అమలు చేస్తున్నారు. రైల్వేలు, జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, ఉపాధిహామీ నిధులన్నీ కేంద్రానివే. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు తప్ప పథకాల నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే దిల్లీ నుంచి ప్రధాని వచ్చి చూసి వెళ్లారు. హైదరాబాద్‌లో ఉన్న సీఎంకు సోయిలేదు. కొవిడ్, వరదలప్పుడు గడీల నుంచి బయటకు రాలేదు. ఆ సమయాల్లో ప్రజలకు సేవ చేసింది భాజపా.
- తెరాస, భాజపా ఒక్కటేనని... కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో తెరాస మద్దతిస్తోందన్న రేవంత్‌రెడ్డి విమర్శలపై మీ స్పందన?