తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi sanjay Fires on KCR: తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే: బండి సంజయ్​ - కేసీఆర్​ తాజా వార్తలు

Bandi sanjay Fires on KCR: సర్జికల్ స్ట్రయిక్‌, విద్యుత్​ సంస్కరణలు, రఫేల్​పై ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి కేసీఆర్​కు స్క్రిప్ట్ వస్తుందని సంజయ్​ ఎద్దేవా చేశారు. తెలంగాణకు తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరేనని ఎద్దేవా చేశారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Feb 14, 2022, 5:42 PM IST

Updated : Feb 14, 2022, 6:03 PM IST

Bandi sanjay Fires on KCR: సర్జికల్ స్ట్రయిక్‌ జరగలేదని సీఎం కేసీఆర్‌ అనటం దారుణమని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రయిక్‌ జరిగినప్పుడు దేశమంతా సంబురాలు చేసుకున్నారని సంజయ్​ చెప్పారు. రాహుల్‌గాంధీ, కేసీఆర్‌కు మాత్రమే సర్జికల్‌ స్ట్రయిక్‌ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాలను కేసీఆర్​ కించపరిచారని సంజయ్​ ఆరోపించారు. ఉగ్రవాదుల మాటలనే నమ్ముతారా? భారత సైనికులపైనా కేసీఆర్‌కు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ జయంతి సందర్భంగా ఆమెకు బండి సంజయ్​ నివాళి అర్పించారు. మూడేళ్ల క్రితం జరిగిన పుల్వామా ఘటనలో అనేక మంది జవాన్లు అమరులయ్యారని చెప్పిన సంజయ్‌ వారికి నివాళి అర్పించారు. పాక్‌ కుట్రకు దీటుగా భారత జవాన్లు సర్జికల్ స్ట్రయిక్‌ చేశారన్న సంజయ్‌.. పాక్‌ భూభాగంలోకి వెళ్లి మన జవాన్లు వీరోచితంగా పోరాడారని కొనియాడారు.

వీరోచిత పోరాటం చేసిన సైనికుల త్యాగాలను కేసీఆర్​ తక్కువచేసి మాట్లాడారని బండి సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్​ను క్షమించాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలకు దేశం మొత్తం బాధపడుతోందని విమర్శించారు. కేసీఆర్​ వ్యాఖ్యలను దేశం మొత్తం ఖండిస్తోందని సంజయ్​ చెప్పారు.

'తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే..'

రఫేల్​పై కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్​ తప్పుపట్టారు. రఫేల్​పై సుప్రీంకోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చినట్లు సంజయ్​ గుర్తుచేశారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి కేసీఆర్​కు స్క్రిప్ట్​ వస్తోందని విమర్శించారు. వారు చెప్పినట్లుగానే కేసీఆర్​ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు తర్వాత పీసీసీ ప్రెసిడెండ్​ కేసీఆరేనని సంజయ్​ ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ, ప్రధాని, ఇతర వ్యవస్థలపై.. కేసీఆర్​కు నమ్మకం లేదని బండి సంజయ్​ విమర్శించారు. దేశంలో నంబర్-1 అవినీతిపరుడు కేసీఆరేనని సంజయ్​ ఆరోపించారు.

'కేసీఆర్​వి జూటా మాటలు''

విద్యుత్​ సంస్కరణల విషయంలో కేసీఆర్​వి జూటా మాటలని సంజయ్​ మండిపడ్డారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్​ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. వాటిపైన దృష్టి మరల్చేందుకే విద్యుత్​ సంస్కరణల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని సంజయ్​ అన్నారు. 2020లో విద్యుత్​ సంస్కరణల బిల్లులో కేంద్రం సవరణలు చేసిందని చెప్పారు. 2021లోనూ మరికొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి 3న విద్యుత్​ సంస్కరణలపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం గైడ్​లైన్స్​ ఇచ్చిందని సంజయ్​ తెలిపారు. అందులో స్మార్ట్​ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు చెప్పారు. ఆ విషయం కేసీఆర్​కు తెలియదా అని ప్రశ్నించారు.

'స్మార్ట్​ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పింది. అయినా కేసీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్​లో విద్యుత్​ బిల్లులు పెరగనున్నాయి. అందువల్ల రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల ఆదాయం రానుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కంలకు రూ.48 వేల కోట్ల బాకీ ఉంది. పాతబస్తీలో చాలా మంది విద్యుత్​ బిల్లులు కట్టడం లేదు. స్మార్ట్​ మీటర్లు పెట్టేందుకు కేసీఆర్​ ప్రయత్నం చేస్తున్నారు.'

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణలో అంబేడ్కర్​ రాజ్యాంగం కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా..? అని బండి సంజయ్​ ప్రశ్నించారు. దళిత బంధు కోసం రాజ్యాంగం మార్చాలా... అని ప్రశ్నించారు. దళిత బంధుకు.. రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అని బండి సంజయ్ నిలదీశారు.

'వాటాలు, కమీషన్లు అడుగుతున్నారు'

తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్​ భావిస్తున్నారని సంజయ్​ ఆరోపించారు. హిజాబ్​పై వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం కోర్టు చెప్పినా.. న్యాయవ్యవస్థ ఆదేశాలను దిక్కరించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కోసం కేసీఆర్​ మాట్లాడుతున్నారని.. తెలంగాణకు ఎంతమేర పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. వాటాలు, కమీషన్లు అడుగుతున్నారనే.. తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని బండి సంజయ్​ ఆరోపించారు.

'రామానుజ విగ్రహం వద్దకు కేసీఆర్​ ఎందుకు వెళ్లలేదు. రామానుజచార్యులు సమానత్వం కోసం పాటుపడ్డారు. అది కేసీఆర్​కు నచ్చదు. ఎందరో ప్రముఖులు వచ్చినా.. గతంలో వెళ్లిన కేసీఆర్​.. ఇప్పుడు ఎందుకు వెళ్లలేదు.'

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Bandi sanjay Fires on KCR: తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే: బండి సంజయ్​

ఇదీచూడండి:

Last Updated : Feb 14, 2022, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details