అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి సారించిన భాజపా... నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే... ప్రచారాన్ని హోరెత్తించనుంది. గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై భాజపా ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్... రాష్ట్ర భాజపా నేతలతో కలిసి ఛార్జీషీట్‌ను విడుదల చేయనున్నారు. భాగ్యనగర ప్రజలు మెచ్చేలా భాజపా ఎన్నికల ప్రణాళిక ఉంటుందన్న నేతలు... ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.
రంగంలోకి జాతీయ నేతలు
రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలతో ప్రచారం సాగిస్తామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాష్ జవడేకర్, ఫడణవీస్, ఖుష్బూ, దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, భుపేంద్ర యాదవ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన భాజపా సీనియర్ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. బీ-ఫాం దక్కని వాళ్లు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేస్తే శాశ్వతంగా బహిష్కరిస్తామని కమలదళపతి స్పష్టం చేశారు.