ఇటీవల కాంగ్రెస్ నుంచి మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బండ కార్తీక రెడ్డి, శేరిలింగంపల్లి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కుమారుడు రవికుమార్ యాదవ్ తమ అనుచరులతో కలిసి భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ విజయశాంతి రేపో, మాపో కాషాయ కండువా కప్పుకోనుండగా.. కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురు మాజీ ఎంపీలను తీసుకువచ్చేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారు. బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్.... మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. భాజపా నేతల ఆహ్వానం పట్ల సర్వే సత్యనారాయణ సుముఖత వ్యక్తం చేశారు. సర్వే సత్యనారాయణని భాజపాలోకి తీసుకురావడంలో వివేక్ ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు.
క్యూలో పలువురు నేతలు
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భుపేంద్ర యాదవ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను భాజపా నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి, భాజపా దూకుడుతో కాషాయ కండువా కప్పుకునేందుకు నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.