BJP News: హైదరాబాద్ వేదికగా నిర్వహించే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల విజయవంతం కోసం పార్టీ జాతీయ నాయకులు రంగంలోకి దిగారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ప్రతినిధులతోను నేతలు సమావేశం కానున్నారు. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం అనంతరం అధికార ప్రతినిధులతో సమావేశమవుతారు. కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లకు 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కమలనాథులు వాటిపై కసరత్తు చేస్తున్నారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2,3 తేదీల్లో జరగనున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జులై 2 సాయంత్రం 4గంటల నుంచి మూడో తేదీ సాయంత్రం 5గం. వరకూ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేశామా లేదా అని సమీక్షించుకోవడంతో పాటు పలు అంశాలపై కమలనాథులు తీర్మానాలు చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా భాజపా నేతలు చర్చించనున్నారు.