JP Nadda Hyderabad TOUR: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో నడ్డాకు.. ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, రాంచందర్‌రావు సహా ఇతర నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్ అరెస్ట్, అందుకు నిరసనగా భాజపా ర్యాలీ వంటి అంశాలపై విమానాశ్రయంలోనే పార్టీ నేతలతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. భేటీలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయ శాంతి, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భేటీ అనంతరం.. జేపీ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలోనే ప్రస్తుత పరిస్థితిని పోలీసులు వివరించారు. అక్కడే నోటీసులు ఇచ్చారు. అనంతరం శంషాబాద్ నుంచి జేపీ నడ్డా సికింద్రాబాద్ బయలుదేరారు. నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ వెళ్లారు. కరోనా నిబంధనలున్నాయని.. ర్యాలీకి అనుమతి లేదని సీపీ చెప్పారన్న నడ్డా.. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తానని స్పష్టం చేశారు. అన్నీ కరోనా నిబంధనలు పాటిస్తానన్నారు. తన ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని స్పష్టం చేశారు.
'నన్ను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. నేను అన్ని కరోనా నిబంధనలు పాటిస్తానని చెబుతున్నా. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తా. నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు. శాంతియుతంగా ర్యాలీ జరిగి తీరుతుంది. బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తా.'
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా.. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు భాజపా ర్యాలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా రాకతో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం వాతావరణం నెలకొంది.