కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని (mp arvind on paddy procurement) మాత్రమే చెప్పిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ స్పష్టం చేశారు. గతంలో చాలాసార్లు కోటి ఎకరాల్లో వరి పంట పండినా.. కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం రబీ పంటను కొనమంటేనే ఉలిక్కిపడ్డారని (mp arvind fires on kcr) ఎద్దేవా చేశారు. తెలంగాణలో వరిసాగును ప్రోత్సాహించాలని.. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కల్వకుంట్ల కుటుంబం జేబులు నింపేందుకు రైతులు వరి పండిస్తోన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
భాజపా బలోపేతం అవుతుందనే భయంతో బలహీనపడిన కాంగ్రెస్‌ను బతికించేందుకు కేసీఆర్, కేటీఆర్ నాటకం ఆడుతున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. రాహుల్ గాంధీ సక్కగా లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపయోగం లేదని విమర్శించారు.
గత ఏడేళ్లలో తెలంగాణకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న అర్వింద్.. తామే కేంద్రాన్ని, రాష్ట్రాన్ని నడుపుతున్నామని చెప్పకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని నడిపే సత్తా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. కొకైన్ నుంచి కాళేశ్వరం వరకు తెరాస అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.