ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల మహా పాదయాత్రకు(Amaravati Maha Padayatra) భాజపా మద్దతిస్తుందని... ఆ పార్టీ నేతలు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి నెల్లూరుకి పార్టీ నేతలు బయలుదేరనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేత పురందేశ్వరి(purandeswari about padayatra) రాజధానికి తాత్కాలిక భవనాల నిర్మాణంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భూకేటాయింపులు చేయాల్సి ఉందని... కొన్నిచోట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భూమి తీసుకుందని పేర్కొన్నారు. రాజధాని రైతుల మహా పాదయాత్రలో సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, పాల్గొంటారని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి మహాపాదయాత్రకు సంఘీభావంగా కృష్ణా జిల్లా నూజివీడు నుంచి భాజపా నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న రైతులకు... పాదయాత్రలో పాల్గొని తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు. నూజివీడు నుంచి పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
అమరావతి రైతుల మహాపాద యాత్ర 21వ రోజుకి (Amaravati padayatra today) చేరుకుంది. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట రైతులు చేస్తున్న పాదయాత్ర.. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లాలో 16 రోజుల పాటు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది.
ప్రజల స్పందన ఎలా ఉందంటే?
పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పొర్లుతుండటంతో.. అడ్డంకులు ఏర్పడి గురు, శుక్రవారాల్లో విరామం ఇచ్చారు. మహిళలు ఇబ్బంది పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మహాపాదయాత్రకు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానంలోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.