కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొంది. టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ భాజపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ... మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా ఆందోళనకు దిగింది. ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన ప్రాంతంలో ధర్నా చేసేందుకు భాజపా పిలుపునిచ్చింది.
తీర్మానాన్ని రద్దు చేయాలి
ఈ ఆందోళనకు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరవుతున్నారన్న సమాచారంతో... ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రాజీవ్ కూడలి, శివాలయం కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సోము వీర్రాజుతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో తోపులాట జరిగింది. ముఖ్యమంత్రి జగన్, వైకాపా ఎమ్మెల్యేలు హిందూ మతానికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పొద్దుటూరులో విగ్రహ ఏర్పాటుకు ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీశారు. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.