దుబ్బాక ఎన్నికలు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలని... భాజపా నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు, భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆంటోనీ రెడ్డి... సీఈవోతో భేటీ అయ్యారు. భాజపా కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడిపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి, సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు.
దుబ్బాకలో తెరాస పతనానికి నాంది పడబోతోందని, అందుకే ఎలాగైనా గెలవాలని అక్రమాలకు పాల్పడుతున్నారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉన్నప్పుడు... బండి సంజయ్‌ను కరీంనగర్‌కు, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డిని హైదరాబాద్‌కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.